కలం, వెబ్డెస్క్: ఏపీలో పంచాయతీ ఎన్నికల (AP Panchayat Elections) హడావుడి మొదలైంది. ఆదివారం నుంచి ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. రాష్ట్రంలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. తొలి విడతలో భాగంగా 3,967 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 15 నుంచి 17 వరకు సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నవంబర్ 18న నామినేషన్లను పరిశీలించనున్నారు. 19న తిరస్కరణకు గురైన నామినేషన్లపై అప్పీళ్ల దాఖలు చేసుకునే అవకాశం ఉంది. 20న అప్పీళ్ల పరిష్కారం, 21న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. తొలి విడత పోలింగ్ నవంబర్ 26న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుండగా, అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
రెండో విడతలో 4,960, మూడో విడతలో 4,240 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోలింగ్ నవంబర్ 29, డిసెంబర్ 2 తేదీల్లో జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13,167 సర్పంచ్, 1,32,514 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 2.61 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మరోవైపు రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలకు కూడా ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 14 నుంచి 16 వరకు నామినేషన్ల స్వీకరణ, 17న పరిశీలన, 19న ఉపసంహరణకు గడువు నిర్ణయించారు. నవంబర్ 26న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు జరగనుంది. పంచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా నిర్వహించనున్నారు.

