కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కామ్(AP Liquor Scam) నిందితులకు ఈడీ షాక్ ఇచ్చింది. నిందితులకు చెందిన రూ.441కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. మద్యం కుంభకోణంలో కీలక నిందితులైన కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బూనేటి చాణక్య, దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డికి ఈ ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. గత ప్రభుత్వ హయాంలో.. 2019లో లిక్కర్ పాలసీలో మార్పులు జరిగి, రూ.4వేల కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ.. పాలసీ మార్పుల్లో ప్రధానంగా పాత మద్యం బ్రాండ్లను మార్కెట్ నుంచి తొలగించి, తమకు అనుకూలమైన బ్రాండ్లకు ప్రత్యేక ఆర్డర్లు ఇచ్చినట్లు గుర్తించింది. అలాగే, ప్రతి లిక్కర్ బాటిల్స్ కేస్‌పై 15 నుంచి 20 శాతం వరకు కిక్ బ్యాక్ తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. కమిషన్ ఇవ్వని కంపెనీలకు మద్యం ఆర్డర్లు ఇవ్వలేదని కూడా గుర్తించింది. సంచలనం సృష్టించిన ఈ కేసులో(AP Liquor Scam) ప్రస్తుతం ఈడీ దూకుడు పెంచింది. త్వరలో మరిన్ని అరెస్టులు ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది.

