కలం, వెబ్ డెస్క్: తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ (Errabelli Swarna) ను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో మహిళా కాంగ్రెస్ కార్యకలాపాలను బలోపేతం చేయడం, పార్టీ కార్యక్రమాలను గ్రామస్థాయి వరకు విస్తరించడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తారని పార్టీ నాయకత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. ఇప్పటివరకు ఈ పదవిలో సునీతారావు ఉన్నారు. ఆమె పదవీ కాలం పూర్తవవడంతో ఎర్రబెల్లి స్వర్ణను నియమించారు.
ఎర్రబెల్లి స్వర్ణ ప్రస్థానమిది..
ఎర్రబెల్లి స్వర్ణ 1985లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి ఇప్పటివరకు వివిధ హోదాల్లో పార్టీ పదవులు, నామినేటెట్ పదవులు నిర్వహించారు. సుమారు 20 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) సభ్యురాలిగా ఉన్నారు. 1997లో ఏపీసీసీ కార్యవర్గ సభ్యురాలిగా పనిచేశారు. నన్నపనేని రాజకుమారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. టీపీసీసీ సభ్యురాలిగానూ సేవలందించారు. 1991 నుంచి 2000 వరకు వర్ధన్నపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అదే సమయంలో వరంగల్‌లోని మార్కెటింగ్ సొసైటీ డైరెక్టర్‌గానూ సేవలందించారు. 2005లో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 39వ డివిజన్ కార్పొరేటర్‌గా ఎన్నికై 2010 వరకు వరంగల్ మేయర్‌గా పనిచేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ (వెస్ట్) నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2022, 2023 సంవత్సరాల్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రలో, 2022లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన పాదయాత్రలో, 2023లో తెలంగాణలో నిర్వహించిన భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. 2025లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా పనిచేశారు. 2023 మార్చి నుంచి 2025 నవంబర్ వరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించారు.

