కలం, వెబ్ డెస్క్: ఏపీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR Survey) ప్రక్రియలో అత్యంత కీలకమైన ఇంటింటి సర్వే సోమవారం (జూన్ 15) నుంచి ప్రారంభం కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జులై 14 అంటే సుమారు నెలరోజుల పాటు ఈ సర్వే నిర్విరామంగా జరుగనుంది. ఇందులో భాగంగా మొత్తం 46,397 మంది బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వో) ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లను ప్రత్యక్షంగా కలిసి వివరాలు నమోదు చేయనున్నారు. ఇందుకోసం ఈసీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4.16 కోట్ల మంది ఓటర్ల కోసం ప్రత్యేకంగా ఎన్యుమరేషన్ ఫామ్‌లను ముద్రించింది.
ఈ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు బీఎల్‌వోలకు ఈసీ ఇప్పటికే ప్రత్యేక శిక్షణను పూర్తి చేసింది. ఈ సర్వేలో ప్రతి ఓటరుకూ రెండు ఎన్యుమరేషన్ ఫాంలను అందజేస్తారు. వీటిలో ఓటరు పేరు, ఫొటో గుర్తింపుకార్డు (EPIC) నంబరు, చిరునామాతో పాటు పాత ఫొటో ఉంటుంది. మిగిలిన వివరాలను ఓటర్లే స్వయంగా నింపాల్సి ఉంటుంది. ఓటర్లు ఫామ్ ను నింపలేని పక్షంలో బీఎల్‌వోలు ఇందుకు సహకరిస్తారు. నెల రోజుల వ్యవధిలో ఫాంలు ఇవ్వడానికి, నింపిన వాటిని తిరిగి తీసుకోవడానికి బీఎల్‌వోలు ప్రతి ఇంటికీ మూడుసార్లు వస్తారు.
64.6 శాతం మ్యాపింగ్ పూర్తి..
ప్రస్తుత జాబితాను 2002 నాటి ఓటర్ల జాబితాను ప్రాతిపదికగా తీసుకుని మ్యాపింగ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 4.16 కోట్ల మంది ఓటర్లలో ఇప్పటికే 2.68 కోట్ల మందికి (64.6%) మ్యాపింగ్ పూర్తయింది. ఈ సర్వే ద్వారా మిగిలిన 1.47 కోట్ల మంది వివరాలను సేకరించనున్నారు. 2002 జాబితాలో ఓటరు పేరు గానీ, లేదా వారి కుటుంబ సభ్యుల పేర్లు గానీ ఉంటే ఆ వివరాలను సైతం ఫాంలో నమోదు చేయాలి. పూర్తి చేసిన ఎన్యుమరేషన్ ఫాంలను ఓటర్లు జులై 14 లోగా బీఎల్‌వోలకు సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ గడువులోగా ఫాంలు ఇవ్వని వారి పేర్లు జులై 21న విడుదలయ్యే ముసాయిదా జాబితాలో ఉండవు. అలా ఫాంలు ఇవ్వని వారిపై బీఎల్‌వోలు క్షేత్రస్థాయి విచారణ జరిపి, ఆ కారణాలను పోలింగ్ కేంద్రాల నోటీసు బోర్డులపై ప్రదర్శిస్తారు. ఇంటింటి సర్వే ముగిసిన తర్వాత ఈ ప్రక్రియ తదుపరి దశకు చేరుకుంటుంది.
సెప్టెంబర్ 22న తుది జాబితా..
జులై 21న రాష్ట్ర ముసాయిదా ఓటర్ల జాబితాను అధికారులు విడుదల చేస్తారు. ఆ రోజు నుండి ఆగస్టు 20 వరకు ఓటర్లు తమ క్లెయిమ్‌లు, అభ్యంతరాలపై దరఖాస్తులు చేసుకోవచ్చు. కొత్తగా ఓటు హక్కు కోసం ఫాం-6, చిరునామా మార్పుల కోసం ఫాం-8, అలాగే మృతులు లేదా అనర్హుల పేర్ల తొలగింపు కోసం ఫాం-7 ద్వారా అప్లై చేసుకోవాలి. ఈ దరఖాస్తులన్నింటినీ సెప్టెంబర్ 18 వరకు అధికారులు పరిశీలించి అర్హతలను బట్టి తుది జాబితాలో మార్పులు చేస్తారు. అన్ని సవరణలు పూర్తి చేసిన అనంతరం సెప్టెంబరు 22న ఓటర్ల తుది జాబితాను అధికారికంగా ప్రకటించనున్నారు.

