కలం, వెబ్ డెస్క్ : ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. రేపు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో సమావేశం అవుతారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న పలు కీలక ప్రాజెక్టులు, ఆర్థిక సాయం, రాజధాని అమరావతి అభివృద్ధి పనులపై ప్రధానితో సీఎం ప్రాథమికంగా చర్చించనున్నారు.
ఈ పర్యటనలో ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు నిధుల మంజూరుపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ప్రాజెక్టు రెండో దశ నిర్మాణం, భూసేకరణ, నిర్వాసితుల పునరావాస ప్యాకేజీ కింద సుమారు రూ. 33,000 కోట్ల నిధులను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయనున్నారు. పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాది జాతికి అంకితం చేసే చర్యలపై ప్రధాని మోదీతో సీఎం చర్చించే అవకాశం ఉంది. ఈ పర్యటనలో పోలవరం-నల్లమలసాగర్ అనుసంధాన పథకానికి అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను సీఎం కోరనున్నారు.

