జగన్ ‘మావిగన్’ ప్ర‌తిపాద‌న‌పై చంద్ర‌బాబు రియాక్షన్!

క‌లం, వెబ్ డెస్క్‌: ఏపీ రాజ‌ధాని ప్రాంతంగా వైఎస్ జ‌గ‌న్ (YS Jagan) ప్ర‌తిపాదించిన ‘మావిగన్’పై సీఎం చంద్ర‌బాబు (CM Chandrababu) సెటైర్లు వేశారు. జ‌గ‌న్ చెప్పే మావిగ‌న్ (Mavigun) డిక్ష‌న‌రీలో ఎక్క‌డా లేద‌ని చంద్ర‌బాబు అన్నారు. అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త బిల్లుకు పార్ల‌మెంట్‌లో ఆమోదం ల‌భించ‌డంతో ఉద్దండరాయునిపాలెంలో నిర్వ‌హించిన వేడుక‌ల్లో చంద్ర‌బాబు రైతుల‌తో క‌లిసి పాల్గొన్నారు. స‌తీ స‌మేతంగా హారతి వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జ‌రిగిన స‌భ‌లో చంద్ర‌బాబు మాట్లాడారు.

అమరావతి ఇక అన్‌స్టాపబుల్ అని సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. పార్ల‌మెంట్‌లో ఆమోద ముద్ర ప‌డ్డా ఇంకా రాజ‌ధాని మార్చుతామంటూ కొందరు పిచ్చిపిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. అసెంబ్లీలో అమరావతిపై చ‌ర్చ పెడితే క‌నీసం హాజ‌రు కాలేద‌న్నారు. లోక్‌స‌భ‌లో, రాజ్య‌స‌భ‌లో అమ‌రావ‌తి బిల్లును వ్య‌తిరేకించిన ఏకైక పార్టీ అదేన‌ని, ఆ పార్టీని రాష్ట్ర ప్ర‌జ‌లు మ‌ర్చిపోవాల‌ని వైసీపీ పేరు కూడా ప్ర‌స్తావించ‌కుండా విమ‌ర్శ‌లు చేశారు. ఇంకా రాజ‌ధాని గురించి బుద్ధి లేని, న‌వ్వుల పాల‌య్యే వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. అమరావతి ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటూ చంద్ర‌బాబు భావోద్వేగానికి లోన‌య్యారు. నాడు మ‌హిళ‌లు, రైతులు చేస్తున్న దీక్ష‌కు సంఘీభావంగా తన భార్య నారా భువనేశ్వరి రెండు గాజులు ఇచ్చార‌ని, ఇస్తున్న‌ట్లు త‌న‌కు కూడా చెప్ప‌లేద‌ని పేర్కొన్నారు. అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ ఢిల్లీలో అన్ని పార్టీలు చట్టం చేశాయ‌ని, రాజధానిగా అమరావతిని ఎవరూ మార్చలేర‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>