కలం, వెబ్ డెస్క్: డీఎంకే (DMK) ప్రభుత్వ హయాంలో మాదిరిగానే టీవీకే (TVK) పాలనలో కూడా మహిళలపై నేరాలు తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయని అన్నామలై (Annamalai) అన్నారు. టీవీకే పార్టీకి చెందిన ఓ నాయకుడు మహిళపై లైంగికదాడికి పాల్పడ్డాడని పేర్కొంటూ అన్నామలై ఎక్స్ వేదికగా సంచలన పోస్ట్ చేశారు. భర్తను కోల్పోయి ఒంటరిగా ఉంటున్న సదరు మహిళ ఇంటికి టీవీకే ఉత్తర ప్రాంత కార్యదర్శి వేంబులి వెళ్లి ఆమెపై లైంగిక దాడికి పాల్పడటం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోందన్నారు. మహిళల భద్రతకు సంబంధించి టీవీకే అధినేత, సీఎం విజయ్ పదేపదే ఇస్తున్న హామీలకు, క్షేత్ర స్థాయిలో నెలకొన్న పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయన్నారు.
ఇక ఇదే పోస్టులో అన్నామలై డీఎంకేపైనా విమర్శలు గుప్పించారు. గత డీఎంకె సర్కారు హయాంలో మహిళలపై జరిగిన నేరాలు ప్రస్తుత ప్రభుత్వ పాలనలో కూడా ఏమాత్రం తగ్గలేదన్నారు. ఇలాంటి ఘోరమైన నేరాలకు పాల్పడటానికి వారికి ఈ తెగింపు ఎక్కడి నుండి వస్తోందని అన్నామలై ప్రశ్నించారు. ఇటువంటి సాంఘిక వ్యతిరేక కార్యకలాపాలకు రాజకీయ గుర్తింపు రక్షణ కవచంగా మారకుండా సీఎం దృష్టి సారించాలన్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

