కలం, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం నియోజకవర్గాలకు ర్యాంకులు కేటాయించింది (Constituency Rankings). టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న 164 స్థానాలతోపాటు వైఎస్సార్సీపీ శాసనసభ్యులు ఉన్న 11 నియోజకవర్గాలకూ ర్యాంకులిచ్చింది. పాలన, అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం తదితర అంశాలను వీటికి ప్రాతిపదికగా ఎంచుకుంది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ, అధికార, ఎమ్మెల్యే పనితీరును టెక్నాలజీ సాయంతో అంచనా వేసి ఈ ర్యాంకులు కేటాయించింది.
మూడు గ్రేడ్లు..
మొత్తం నియోజకవర్గాలను మూడు గ్రేడ్లుగా విభజించారు (Constituency Rankings). ఇందులో ‘ఏప్లస్’ కేటగిరీ కింద 21, ‘ఏ’లో 153 ఉండగా, ‘బి’లో ఒక్కటి నిలిచింది. 93శాతం మార్కులతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్ర రాజధానిలో భాగమైన ఈ నియోజకవర్గానికి బీజేపీ సభ్యుడు సుజనా చౌదరి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అలాగే రెండో స్థానంలో 92 మార్కులతో గాజువాక నిలిచింది. ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఈయన రాష్ట్రంలోనే అత్యధికంగా 92వేల ఓట్ల మెజార్టీతో గెలిచి రికార్డు సృష్టించారు. కాకినాడ, విజయవాడ తూర్పు మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి.
నియోజకవర్గాల ర్యాంకులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మరింత మెరుగైన పనితీరు కనబరచాలని ఎమ్మెల్యేలకు సూచించారు.
Read Also: అంబటికి రిమాండ్..!
Follow Us On: Sharechat


