కలం, స్పోర్ట్స్ : మాజీ భారత క్రికెటర్, కోచ్ సంజయ్ బంగార్ కుమార్తె అనాయా బంగార్ (Anaya Bangar) మహిళల క్రికెట్‌లోకి తిరిగి రావడానికి చేస్తున్న ప్రయత్నాలకు క్రికెట్ ఆస్ట్రేలియా అవకాశం కల్పించడంపై వివాదం మొదలైంది. ఆస్ట్రేలియా నిర్ణయాన్ని దక్షిణాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ మారిజాన్ కాప్ (Marizanne Kapp) తీవ్రంగా వ్యతిరేకించారు. అనాయాకు మహిళల క్రికెట్‌లో ఆడేందుకు అవకాశం కల్పించడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. అనాయా ఈ ఏడాది మార్చిలో జెండర్ అఫర్మింగ్ సర్జరీ చేయించుకున్నారు. అనంతరం మహిళల క్రికెట్‌లోకి తిరిగి రావాలనే ఉద్దేశంతో క్రికెట్ ఆస్ట్రేలియాను సంప్రదించారు. ఆమె కేసును పరిశీలించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. వైద్య సమాచారం, హార్మోన్ స్థాయిలు, క్రికెట్ నేపథ్యం, ఆటకు సంబంధించిన వీడియోలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం కమ్యూనిటీ క్రికెట్‌కు మాత్రమే అవకాశం
క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం ప్రకారం అనాయా ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలోనైనా కమ్యూనిటీ క్రికెట్ ఆడవచ్చు. ఈ అవకాశం మార్చి 2027 వరకు కొనసాగుతుంది. అయితే ఆ తర్వాత ఎలైట్ మహిళల క్రికెట్‌లోకి ప్రవేశించాలంటే నిర్దిష్ట అర్హతలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా వరుసగా 12 నెలల పాటు టెస్టోస్టెరాన్ స్థాయి 10 nmol/L కంటే తక్కువగా ఉండాలి. మార్చి 2027లో రక్త పరీక్ష నిర్వహించి ఈ ప్రమాణాన్ని మరోసారి నిర్ధారించాల్సి ఉంటుంది.
‘ఇది జట్టులో చోటు కాదు’
తనకు క్రికెట్ ఆస్ట్రేలియా ఇచ్చిన అవకాశం నేరుగా జట్టులో చోటు కల్పించడం కాదని అనాయా స్పష్టం చేశారు. తిరిగి క్రికెట్‌లోకి ప్రవేశించేందుకు ఇది ఒక మార్గం మాత్రమేనని పేర్కొన్నారు. శిక్షణ తీసుకుని, పోటీల్లో పాల్గొని, తన ప్రతిభతోనే జట్టులో స్థానం సంపాదించుకోవాలని అనాయా తెలిపారు. భవిష్యత్తులో ఎలైట్ క్రికెట్‌కు అర్హత సాధిస్తే మహిళల బిగ్ బాష్ లీగ్ (WBBL)లో ఆడే అవకాశం కూడా ఆమెకు లభించవచ్చు.
మారిజాన్ కాప్ తీవ్ర అభ్యంతరం
అయితే క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయంపై దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ మారిజాన్ కాప్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అనాయాకు మహిళల క్రికెట్‌లో ఆడే అవకాశం కల్పించడం అనుమతించకూడని నిర్ణయం అని ఆమె పేర్కొన్నట్లు సమాచారం. దీంతో అనాయా బంగార్ పునరాగమన అంశం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆమె కమ్యూనిటీ క్రికెట్‌లో తన ప్రయాణాన్ని ప్రారంభించనుండగా..మార్చి 2027లో ఎలైట్ మహిళల క్రికెట్‌కు అవసరమైన అర్హతలను సాధిస్తారా?అన్నది ఆసక్తికరంగా మారింది.

