కలం, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎల్ నినో (El Nino) ప్రభావంతో తలెత్తే పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు మండల స్థాయి సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జీవో జారీ చేసింది. ఎంపీడీఓ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో ఈ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. గ్రామీణ కుటుంబాలకు ఉపాధి కల్పించడం, తాగునీటి భద్రతను మెరుగుపరచడం, పశుగ్రాసం అందుబాటును పెంచడం వంటి అంశాలకు కమిటీలు ప్రాధాన్యం ఇవ్వనున్నాయి. రాష్ట్రంలోని 35,959 చిన్న నీటిపారుదల చెరువుల పరిధిలో పశుగ్రాసం సాగుకు అనువైన ప్రాంతాలను గుర్తించి, మహిళా స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యంతో సాగును ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోనున్నారు. పశువులకు తాగునీటి కోసం కొత్త నీటి తొట్టెల నిర్మాణం, ఇప్పటికే ఉన్న తొట్టెల మరమ్మతులు చేపట్టనున్నారు.
నీటి సంరక్షణలో భాగంగా వ్యవసాయ కుంటలు, చెక్‌డ్యామ్‌లు, బోర్వెల్ రీచార్జ్ నిర్మాణాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. గ్రామీణ రహదారులు, కల్వర్టులు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామపంచాయతీ భవనాలు, పశువుల షెడ్ల అభివృద్ధికి అవసరమైన పనులను గుర్తించనున్నారు. ప్రతి గ్రామపంచాయతీలో చేపట్టాల్సిన పనులను గుర్తించి వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలను రూపొందించనున్నారు. మండల స్థాయి సమన్వయ కమిటీలు వారానికి కనీసం ఒకసారి సమావేశమై పనుల పురోగతిని సమీక్షించాలి. చేపట్టిన పనులు, వాటి పురోగతికి సంబంధించిన వారపు నివేదికలను జిల్లా కలెక్టర్లకు సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. కమిటీల ఏర్పాటు నుంచి పనుల అమలు వరకు పర్యవేక్షణ బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించింది.

