కలం, వెబ్‌డెస్క్: హర్యానాలోని ఫరీదాబాద్ (Faridabad) లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ విద్యార్థిని బిర్యానీ తినేందుకు వెళ్లిందని టీచర్ పనిష్మెంట్ ఇవ్వడంతో సదరు విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. విద్యార్థిని జాన్వీ ఫరీదాబాద్‌లోని నవోదయ విద్యా నికేతన్‌తో 11వ తరగతి చదువుతోంది. మంగళవారం జాన్వీ నవోదయలోని మూడో అంతస్తు నుంచి కిందికి దూకింది. గమనించిన పాఠశాల సిబ్బంది ఆమెను ముందు ఓ ప్రైవేటు ఆస్పత్రికి, తర్వాత బీకే ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆమె అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు.
అయితే జాన్వీ మృతి పై ఆమె కుటుంబసభ్యులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. పాఠశాలలో బిర్యానీ తినడంపై విద్యార్థుల మధ్య వివాదం తలెత్తిందని, ఈ ఘటనకు జాన్వీకి ఎలాంటి సంబంధం లేకపోయినా ఆమెను నాలుగు గంటల పాటు ఎండలో నిల్చోబెట్టారని ఆరోపించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన జాన్వీ ఆత్మహత్య చేసుకుందని తెలిపారు.
అయితే పాఠశాల యాజమాన్యం మాత్రం తాము జాన్వీకి ఎలాంటి శిక్ష విధించలేదని చెప్తోంది. వాష్‌రూమ్‌కు వెళ్లొస్తానని చెప్పి జాన్వీ మూడో అంతస్తుపైకి వెళ్లి ఆత్మహత్య చేసుకుందని వెల్లడించింది. ఇక ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాఠశాల యాజమాన్యం, జాన్వీ కుటుంబసభ్యులు, విద్యార్థినులను విచారిస్తున్నారు. పూర్తి విచారణ అనంతరం నిజానిజాలు బయటపడతాయని పోలీసులు వెల్లడించారు.

