కలం, వెబ్ డెస్క్: భారత్‌ను డ్రగ్స్ రహిత దేశంగా మార్చేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉందని కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah) వెల్లడించారు. ఈ క్రమంలోనే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు చేపట్టిన ఆపరేషన్ రేజ్‌పిల్ (Operation Ragepill) ద్వారా దేశ చరిత్రలోనే తొలిసారి జిహాదీ డ్రగ్ అని పిలిచే కాప్టాగన్ అనే రకానికి చెందిన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. పట్టుబడిన ఈ డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో దాదాపు రూ.182 కోట్ల వరకు ఉంటుందని పేర్కొన్నారు.
ఈ భారీ డ్రగ్స్ ముఠాకు సంబంధించిన రవాణా అంతా మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్లేలా ప్లాన్ చేశారని , అయితే మన ఏజెన్సీలు అప్రత్తమంగా వ్యవహరించి ఈ నెట్‌వర్క్‌ను చేధించడంతో పాటు ఒక విదేశీ నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నాయని అమిత్ షా తెలిపారు. డ్రగ్స్ విషయంలో తమ ప్రభుత్వం జీరో టోలరెన్స్ విధానాన్ని అనుసరిస్తుందని చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ అని చెప్పారు. దేశంలోకి ప్రవేశించే ప్రతి గ్రామ్ డ్రగ్‌ను, మన భూ భాగాన్ని ట్రాన్సిట్ రూట్‌గా వాడుకుంటూ దేశం దాటించే ప్రతి డ్రగ్ ముఠాను ఉక్కుపాదంతో అణచివేస్తామన్నారు. దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఎన్‌సీబీ వీరులకు అమిత్ షా అభినందనలు తెలియజేశారు.

