కలం, వరంగల్ బ్యూరో: జనగణన–2027 ప్రక్రియను పారదర్శకంగా, ఖచ్చితత్వంతో నిర్వహించాలని రాష్ట్ర జనగణన డైరెక్టర్ భారతి హోలికెరీ సూచించారు. సోమవారం హనుమకొండ (Hanumakonda) జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్‌పాయితో కలిసి హనుమకొండలోని ఎక్సైజ్ కాలనీ ప్రాంతంలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న హౌస్ లిస్టింగ్, డిజిటల్ మ్యాపింగ్, గృహాల నమోదు ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు ఇంటింటికి వెళ్లి సేకరిస్తున్న వివరాలను సమీక్షించారు. కుటుంబ సభ్యుల వివరాలు, నివాస గృహాల సమాచారం, ప్రాంతాల వారీ నమోదు విధానం, డిజిటల్ పరికరాల వినియోగం తదితర అంశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఏ ప్రాంతానికి చెందిన సమాచారం ఆ ప్రాంతానికి సంబంధించిన కుటుంబాల ఆధారంగా ఖచ్చితంగా నమోదు కావాలని పేర్కొన్నారు. జనగణనలో నమోదు చేసే ప్రతి సమాచారం దేశ ప్రణాళికా రూపకల్పనకు కీలకమని తెలిపారు. అందువల్ల వివరాల నమోదు సమయంలో ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ పూర్తి సమాచారం సేకరించాలని ఎన్యూమరేటర్లకు సూచించారు. ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలు సమగ్రంగా నమోదు చేయాలన్నారు. ఎలాంటి పొరపాట్లు లేదా సమాచార లోపాలు చోటుచేసుకోకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
అదేవిధంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు పూర్తి అవగాహనతో విధులు నిర్వహించాలని, డిజిటల్ మ్యాపింగ్ ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు. జనగణన ప్రక్రియ విజయవంతానికి ప్రజల సహకారం కూడా అత్యంత అవసరమని పేర్కొన్నారు.
హనుమకొండ జిల్లా కలెక్టర్ (Hanumakonda Collector) చాహాత్ బాజ్‌పాయి మాట్లాడుతూ.. జిల్లాలో జనగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని తెలిపారు. సిబ్బందికి క్షేత్రస్థాయిలో శిక్షణ అందిస్తూ డిజిటల్ మ్యాపింగ్, గృహాల నమోదు ప్రక్రియను పారదర్శకంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఓ సత్యనారాయణ రెడ్డి, హనుమకొండ ఎమ్మార్వో రవీందర్ రెడ్డి, మున్సిపల్ అధికారులు బిర్రు శ్రీను, జనగణన విభాగ సిబ్బంది, ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.
Read Also: తెలంగాణ పోలీస్ అధికారులకు అమిత్ షా సన్మానం
Follow Us On: WhatsApp

