కలం, నిర్మల్ : సాధారణ ఎన్నికలంటేనే ప్రచారం, పోటాపోటీ, ఉత్కంఠ.. అలాంటి వాతావరణమే ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగిన పీఆర్టీయూ జిల్లా కమిటీ ఎన్నికల్లో (PRTU Elections) కనిపించింది. సాధారణంగా గ్రామ పంచాయతీ, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర పోషించే ఉపాధ్యాయులే ఎన్నికల బరిలో నిలవడంతో పీఆర్టీయూ ఎన్నికలు రాజకీయ ఎన్నికలను తలపించాయి. జిల్లా కేంద్రంలో సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించిన అనంతరం జిల్లా కమిటీ ఎన్నికలను నిర్వహించారు.
ముందుగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్లో చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. అనంతరం జిల్లా కమిటీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. బి.వి రమణారావు – టి. నరేంద్రబాబు, బద్దం సాయిరెడ్డి – బారే శ్రీనివాస్ ప్యానళ్ల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన పోలింగ్ లో జిల్లాలోని 19 మండలాలకు చెందిన మండల కార్యవర్గ బాధ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పీఆర్టీయూలో మొత్తం 2,006 మంది సభ్యులు ఉండగా.. జిల్లా కమిటీ ఎన్నికల్లో మండల కమిటీలకు చెందిన 176 మంది బాధ్యులు ఓటు వేశారు. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో రమణారావు – నరేంద్రబాబు ప్యానల్ ఘన విజయం సాధించింది. ఎన్నికల అధికారులుగా ఆదిలాబాద్ జిల్లా పీఆర్టీయూ అధ్యక్షుడు కృష్ణకుమార్, ప్రధాన కార్యదర్శి నరసింహస్వామి వ్యవహరించారు.
జిల్లా అధ్యక్షులుగా బి.వి.రమణారావు, ప్రధాన కార్యదర్శిగా టి. నరేంద్ర బాబు, అసోసియేట్ అధ్యక్షులుగా కె. భూమారెడ్డి, వి. గణేష్, మహిళా అసోసియేట్ అధ్యక్షురాలుగా సిహెచ్. వందన, సి. సుజాత. ఉపాధ్యక్షులుగా శ్రీధర్ రెడ్డి, అబ్దుల్ అహద్, పుండలిక్, శ్రీనివాస్, శేఖర్, మహిళా ఉపాధ్యక్షురాలుగా సునీత, కవిత. కార్యదర్శులుగా ధనుంజయ్, చంద్రశేఖర్, శ్రీనివాస్ రావు, రాజశేఖర్, నాగేశ్వర్, మహిళా కార్యదర్శులుగా గీతా రాణి, హేమలత ఎన్నికయ్యారు.

