కలం, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని ఉండవల్లి (Undavalli) సెంటర్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బలవంతపు, అక్రమ భూసేకరణకు వ్యతిరేకంగా పెనుమాక రైతులు కొద్దిరోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. స్థానిక రైతులు ఇచ్చిన ఆహ్వానం మేరకు మాజీ మంత్రులు పేర్ని నాని (Perni Nani), అంబటి రాంబాబు (Ambati Rambabu), ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైసీపీ సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ సభ్యులు రాజధాని భూముల పరిశీలనకు వెళ్లారు. వీరిని టీడీపీ శ్రేణులు, కొందరు రైతులు అడ్డుకున్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ‘గో బ్యాక్’ అంటూ నినాదాలు చేస్తూ వైసీపీ నేతలపైకి కోడిగుడ్లు, టమోటాలు విసిరారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. టీడీపీ శ్రేణుల దాడిలో లేళ్ల అప్పిరెడ్డి కారుతో పాటు వైసీపీ నేతల వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
ఈ ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో నిరసనకారులు పోలీసులు, వైసీపీ నేతలపైకి రాళ్లు విసిరారు. ఈ రాళ్ల దాడిలో ఒక పోలీస్ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఉండవల్లిలో శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. భూసేకరణపై వైసీపీ నేతల పర్యటన తీవ్ర ఘర్షణకు దారితీయడంతో అమరావతి ప్రాంతంలో ప్రస్తుతం భయాందోళనలు నెలకొన్నాయి. టీడీపీ కార్యకర్తలే కుట్ర పన్ని దాడి చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

