కలం, నల్లగొండ: విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా స్కూళ్ల సంఖ్యను పెంచాలని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి (Alugubelli Narsireddy) ప్రభుత్వాన్ని కోరారు. శనివారం యూటీఎఫ్ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్న మూడు ప్రధాన పార్టీలు ప్రభుత్వ బడుల మూతపై నోరు మెదపడం లేదన్నారు. పారిశ్రామీకరణ పట్టణీకరణ మూలంగా గ్రామీణ ప్రాంతాల్లోని యువ దంపతుల వలసలతో నగరాల్లో పెరిగిన జనాభాకు అనుగుణంగా నేడు ప్రభుత్వ బడులు లేవని, జనాభా పెరుగుదలకు అనుగుణంగా నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, నకిరేకల్, చండూరు లాంటి పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ బడులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు.
నల్లగొండ పట్టణంలో 44 వేల మంది విద్యార్థులు చదువుతుండగా అందులో కేవలం ఒక 5వేల మంది మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారని, నల్లగొండ పట్టణంలో బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసిన విధంగానే కేశరాజు పల్లి, రామగిరి, జేబీఎస్, అక్కలాయి గూడెం పాఠశాల అభివృద్ధి చేస్తే పట్టణ ప్రాంతంలో ఆర్థికంగా వెనకబడిన ఎంతో మందికి, మధ్య తరగతి వర్గానికి సౌకర్యంగా ఉంటుందని అందుకు స్థానిక మంత్రి చొరవ చూపాలని కోరారు. టీచర్ల సర్దుబాటు విద్యార్థుల సౌకర్యార్థం ఉండాలని, ఉపాధ్యాయుల వ్యక్తిగత అవసరాల కోసం కాదని, ఇలాంటి అశాస్త్రీయ డిప్యూటేషన్లు పూర్తిగా ఖండిస్తున్నానని, తాను ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో పలు జిల్లా పరిషత్ సమావేశంలో విద్యార్థులు పెరిగిన చోటికి ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలనే ఒక తీర్మానం కూడా చేపించానని నర్సిరెడ్డి (Alugubelli Narsireddy) గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నల్లగొండ జిల్లా కమిటీ అక్రమ డిప్యూటేషన్ పెద్ద కోసం ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటుందని. అవసరమైతే తాను అక్రమ డిప్యుటేషన్ల రద్దు కోసం ప్రజలను సమీకరిస్తానని అన్నారు. సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.రాజశేఖర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు బక్కా శ్రీనివాసాచారి, రాష్ట్ర పూర్వ కార్యదర్శి జి నాగమణి, ఎడ్ల సైదులు, జిల్లా ఉపాధ్యక్షులు నర్రా శేఖర్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు జి.అరుణ, జిల్లా కార్యదర్శులు గేర నరసింహ, శ్రీనివాస్ రెడ్డి, నలపరాజు వెంకన్న, ఆడిట్ కమిటీ సభ్యులు భాను ప్రకాష్, మధుసూదన్ వివిధ కమిటీల కన్వీనర్లు పగిడిపాటి నరసింహ, ప్రభాకర్, బి.సురేందర్ రెడ్డి, ఎరనాగుల సైదులు, శ్యాం కుమార్, శ్రీలత, వరలక్ష్మి, రాగి రాకేష్, వివిధ మండలాల బాధ్యులు పాల్గొన్నారు.
Read Also: నా సోదరుడు గుర్తొచ్చాడు.. డీజీపీ సీవీ ఆనంద్ భావోద్వేగం
Follow Us On: Instagram

