Mobile Popup Ad
Mobile Popup Ad

వరల్డ్ కప్‌లో ఇరాన్ ఆశల్ని సజీవంగా ఉంచిన బీరాన్‌వాండ్

కలం, వెబ్‌డెస్క్: ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup) గ్రూప్ దశ ముగింపుకు చేరుకుంటున్న వేళ, ఇరాన్ గోల్‌కీపర్ అలీరెజా బీరాన్‌వాండ్ (Alireza Beiranvand) పేరు ప్రపంచ ఫుట్‌బాల్‌లో మార్మోగుతోంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో ఉన్న బెల్జియాని గోల్ చేయనివ్వకుండా నిలువరించి, ఇరాన్‌కు కీలకమైన గోల్‌లేని డ్రా అందించాడు. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో బీరాన్‌వాండ్ ఏడు అద్భుత సేవ్‌లు చేశాడు. అతని ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

బెల్జియం వరుసగా దాడులు చేసినా, ఇరాన్ గోల్‌పోస్ట్‌ను అతడు కాపాడాడు. బీరాన్‌వాండ్ కథ మాత్రం మైదానంలోని విజయాలకే పరిమితం కాదు. ఇరాన్‌లోని లోరెస్టాన్ ప్రాంతంలో పేద కుటుంబంలో జన్మించిన అతనికి చిన్నప్పటి నుంచి ఫుట్‌బాల్ ఆడాలనే కల ఉండేది. అయితే కుటుంబ పరిస్థితులు, తండ్రి వ్యతిరేకత కారణంగా ఆ కల సులభం కాలేదు. యువకుడిగా ఉన్నప్పుడు కొంత డబ్బు అప్పుగా తీసుకుని టెహ్రాన్‌కు వెళ్లాడు.

అక్కడ మొదట్లో ఉండటానికి ఇల్లు కూడా లేకపోవడంతో ఫుట్‌బాల్ క్లబ్‌ల బయటే రాత్రులు గడిపాడు. జీవనం కోసం వీధులు ఊడ్చడం, కార్ వాష్‌లో పని చేయడం, ఫ్యాక్టరీల్లో శ్రమించడం, పిజ్జా దుకాణంలో పనిచేయడం వంటి ఎన్నో పనులు చేశాడు. చిన్ననాటి నుంచి కొండ ప్రాంతాల్లో గొర్రెలను కాపాడుతూ రాళ్లు దూరంగా విసిరే స్థానిక ఆట ఆడేవాడు. అదే అతనికి అసాధారణ శారీరక శక్తిని ఇచ్చింది. తర్వాత ఫుట్‌బాల్ చరిత్రలో అత్యంత పొడవైన త్రో, అత్యంత పొడవైన డ్రాప్‌కిక్ రికార్డులను నెలకొల్పి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు.

ఈ వరల్డ్ కప్‌లో ఇరాన్ జట్టు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వీసా పరిమితులు, ఇతర కారణాల వల్ల అమెరికాలో పూర్తి స్థాయి శిబిరం ఏర్పాటు చేయలేక మెక్సికోలోనే బస చేయాల్సి వచ్చింది. మ్యాచ్‌లకు ముందు కూడా ప్రయాణాల వల్ల జట్టు అలసటను ఎదుర్కొంది. అలాంటి పరిస్థితుల్లోనూ బెల్జియంపై ఇరాన్ క్లీన్ షీట్ నమోదు చేయడం విశేషంగా మారింది. రెండు మ్యాచ్‌ల్లో రెండు పాయింట్లు సాధించిన ఇరాన్, నాకౌట్ దశకు చేరే అవకాశాలను ఇంకా సజీవంగా ఉంచుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>