మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌లో మార్పులు

కలం, స్పోర్ట్స్ : మహిళల క్రికెట్ ప్రపంచంలో ఒక సంచలన అప్‌డేట్ వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా మహిళల క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సోమవారం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా 2027లో జరగబోయే మొట్టమొదటి మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ (Women Champions Trophy 2027) షెడ్యూల్‌ను ఐసీసీ పూర్తిగా మార్చేసింది. తొలుత ఈ టోర్నమెంట్‌ను జూన్, జూలై నెలల్లో నిర్వహించాలని అనుకున్నారు. కానీ తాజా నిర్ణయం ప్రకారం, దీనిని 2027 ఫిబ్రవరి 14 నుండి 28 వరకు నిర్వహించనున్నారు. అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్‌లో మహిళల మ్యాచ్‌లకు ఒక ప్రత్యేక సమయాన్ని కేటాయించడానికి, అలాగే ప్లేయర్లకు మెరుగైన వాతావరణ పరిస్థితులు కల్పించడానికి ఈ మార్పు చేసినట్లు ఐసీసీ తెలిపింది.

క్రికెట్ వృద్ధిపై అహ్మదాబాద్‌లో జరిగిన చర్చల గురించి ఐసీసీ చైర్మన్ జై షా మాట్లాడుతూ… క్రీడల్లో పారదర్శకత, పోటీతత్వాన్ని పెంచడమే తమ లక్ష్యమని చెప్పారు. మహిళల క్రికెట్, ఫ్రెంచైజీ పోటీల నిర్వహణతో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరించేలా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఐసీసీ మరో కీలక అడుగు వేసింది. కొత్తగా ఎదుగుతున్న దేశాల ఆటగాళ్లకు అంతర్జాతీయ అనుభవాన్ని అందించేందుకు 2026లో ‘ఉమెన్స్ ఎమర్జింగ్ నేషన్స్ ట్రోఫీ’ని ప్రారంభించబోతోంది. ఇందులో మొత్తం పది జట్లు తలపడతాయి. ర్యాంకింగ్స్, పాత టీ20 వరల్డ్ కప్ క్వాలిఫికేషన్ ఆధారంగా ఐదు ఫుల్ మెంబర్ దేశాలు, ఐదు అసోసియేట్ మెంబర్ జట్లను దీనికోసం ఎంపిక చేస్తారు.

చివరగా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) ఆతిథ్యం ఇవ్వనున్న 2028 మహిళల టీ20 వరల్డ్ కప్ అర్హత విధానాన్ని కూడా ఐసీసీ ఖరారు చేసింది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్‌లను మాత్రం తటస్థ వేదికల్లో (న్యూట్రల్ వెన్యూస్) నిర్వహిస్తారు. ఈ మెగా టోర్నీలో మొత్తం 12 జట్లు పాల్గొంటాయి. ఇందులో 2026 వరల్డ్ కప్‌లో టాప్-8లో నిలిచిన జట్లతో పాటు, ఆతిథ్య దేశం, జూలై 6, 2026 నాటి ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా 10 జట్లు నేరుగా అర్హత సాధిస్తాయి. మిగిలిన రెండు స్థానాల కోసం 10 జట్లతో గ్లోబల్ క్వాలిఫైయర్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను జూలైలో జరిగే ఐసీసీ సమావేశాల్లో ఖరారు చేయనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>