కలం, జోగుళాంబ గద్వాల: ఎన్నికల సమయంలో హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చాక ప్రజా సమస్యలను గాలికొదిలేస్తున్న ప్రభుత్వాల తీరును మండలిలో ఎండగడతానని హైదరాబాద్–మహబూబ్‌నగర్–రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) నాయకుడు ఆకాశ్ కొల్లూరు(Akash Kolluru) అన్నారు. తనను మండలికి పంపితే ప్రజా సమస్యలపై ప్రభుత్వాల గల్లా పట్టి నిలదీస్తానని ఆయన సవాల్ విసిరారు. గురువారం గద్వాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, చేనేత, చేతివృత్తుల కార్మికుల సమస్యలపై ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు.
గద్వాల పీజీ సెంటర్‌కు నిధుల కొరత, పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్, విద్యార్థుల మెస్ సమస్యలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. పార్ట్‌టైమ్ అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు బేసిక్ పే, న్యాయవాదులకు ఆరోగ్య బీమా, జూనియర్ న్యాయవాదులకు గౌరవప్రదమైన వేతనం కల్పించాలన్నారు. చేనేత, కుమ్మరి కార్మికుల శ్రమకు తగిన గుర్తింపు, గిట్టుబాటు ధరలు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో యువతకు ఆశించిన స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పటివరకు కేవలం 16 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసిందని విమర్శించారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన తనకు విద్యార్థులు, నిరుద్యోగుల కష్టాలు తెలుసన్నారు. తన పోరాటం పదవుల కోసం కాదని.. ప్రజల హక్కుల కోసమని, హామీలు ఇచ్చే నాయకులు కాదు.. హక్కులు సాధించే ప్రతినిధులు కావాలని ఆయన స్పష్టం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీలో టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగుతున్న తనను గెలిపించాలని పట్టభద్రులను కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఇన్ఛార్జ్ రంజిత్ కుమార్, జిల్లా అధ్యక్షుడు బుచ్చిబాబు యాదవ్, కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ రఘు, తదితరులు పాల్గొన్నారు.

