కలం, వెబ్ డెస్క్: అఫ్గానిస్థాన్‌తో సిరీస్‌కు భారత్ సిద్ధమవుతున్న వేళ.. సీనియర పేసర్ షమీ (Shami)పై సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. షమీ పేరుపై సెలెక్షన్ మీటింగ్‌లో ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. షమీ ప్రస్తుతం కేవలం టీ 20 ఫార్మాట్ ఆడేందుకు మాత్రమే ఫిట్‌గా ఉన్నాడని అగార్కర్ వెల్లడించారు. టెస్ట్, వన్డే వంటి పెద్ద ఫార్మాట్లలో ఆడేందుకు అతడి శరీరం ఇంకా పూర్తిగా సహకరించడం లేదని పేర్కొన్నారు. దేశీయ క్రికెట్‌లో షమీ అద్భుత ప్రదర్శన ఇస్తున్న విషయం తమకు తెలుసని, అయినా పూర్తి ఫిట్‌నెస్‌పై ఇంకా సందేహాలు ఉన్నాయని చెప్పారు.
దేశవాళీలో సత్తా చాటినా..
2025 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత షమీ భారత జట్టుకు దూరమయ్యాడు. ఆ టోర్నీలో వరుణ్ చక్రవర్తితో కలిసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచినా.. ఆ తర్వాత ఏ ఫార్మాట్‌లోనూ జట్టులోకి తిరిగి రాలేకపోయాడు. అయితే దేశీయ క్రికెట్‌లో మాత్రం షమీ సత్తా చాటాడు. రంజీ ట్రోఫీలో బెంగాల్ జట్టును సెమీఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తూ 7 మ్యాచ్‌ల్లో 37 వికెట్లు తీశాడు. విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీల్లో కూడా ప్రభావవంతమైన బౌలింగ్ చేశాడు. ఇక లక్నో సూపర్ జయంట్స్ తరఫున ఐపీఎల్‌లో ఆడుతున్న షమీ ఇప్పటివరకు 12 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు సాధించాడు. స్లోయర్ బాల్స్‌తో అగ్రశ్రేణి బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నాడు. అయినా అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి రావాలంటే మరింత మెరుగైన ఫిట్‌నెస్‌ను నిరూపించాల్సిన అవసరం ఉందని సెలెక్టర్ల సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో షమీ భవితవ్యంపై అనేక ప్రశ్నలు అలాగే మిగిలి ఉన్నాయి.

