కలం, స్పోర్ట్స్ : అహ్మదాబాద్‌లో జరుగుతున్న తొలి వరల్డ్ యోగాసన ఛాంపియన్‌షిప్స్‌లో అర్జెంటీనాకు చెందిన నబీలా సోల్ బరాజా (Nabila sol Bazzara) కూడా అందరి దృష్టిని ఆకర్షించారు. అద్భుత ప్రదర్శనతో రెండు స్వర్ణాలు, రెండు రజతాలతో కలిపి మొత్తం ఐదు పతకాలు గెలిచి విదేశీ క్రీడాకారుల్లో అత్యంత విజయవంతమైన అథ్లెట్లలో ఒకరిగా నిలిచారు. అర్జెంటీనాలోని రొసారియో నగరానికి సమీపంలో జన్మించిన నబీలాకు యోగాసనతో పరిచయం కాలేజీ రోజుల్లో ఒక స్నేహితురాలి ద్వారా ఏర్పడింది. ఆసక్తిగా మొదలైన ఆ ప్రయాణం క్రమంగా అభిరుచిగా మారి, చివరకు ఆమెను భారతదేశానికి తీసుకొచ్చింది.
ముంబైలో దాదాపు ఐదేళ్ల పాటు నివసించిన నబీలా (Nabila sol Bazzara) భారతీయ సంస్కృతిని దగ్గరగా తెలుసుకుంది. హిందీ పదాలు నేర్చుకుంది. బాలీవుడ్ చిత్రాల్లో బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా కూడా పనిచేసింది. నటుడు టైగర్ ష్రాఫ్‌తో కలిసి పనిచేసిన అనుభవం కూడా ఆమెకు దక్కింది. ఇదే సమయంలో క్రికెట్‌పై కూడా ఆసక్తి పెంచుకుంది. అర్జెంటీనాలో ఫుట్‌బాల్‌కు ఉన్న క్రేజ్‌ను చూసిన తాను, భారత్‌లో క్రికెట్‌పై ప్రజలకు ఉన్న అభిమానాన్ని సులభంగా అర్థం చేసుకున్నానని ఆమె తెలిపింది. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి తాను అభిమానినని కూడా చెప్పింది.
అయితే క్రికెట్ కంటే యోగానే తన జీవితాన్ని పూర్తిగా మార్చిందని నబీలా పేర్కొంది. యోగా తత్వశాస్త్రం తనను ఆకర్షించడంతో రిషికేశ్‌కు వెళ్లి సాధన చేసింది. అనంతరం నాసిక్‌లో కూడా తన శిక్షణను కొనసాగించింది. ఈ అనుభవాలు తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయని తెలిపింది. ఒంటరి తల్లి పెంచిన ముగ్గురు పిల్లల్లో ఒకరైన నబీలా ప్రస్తుతం కొలంబియాలో నివసిస్తోంది. అక్కడ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ యోగా తరగతులు నిర్వహిస్తూ యోగాను మరింత మందికి చేరువ చేస్తోంది. యోగా శరీరం, మనసు, ఆత్మను ఆరోగ్యంగా ఉంచుతుందని, వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా దీనిని అభ్యసించవచ్చని ఆమె అభిప్రాయపడింది.
వరల్డ్ యోగాసన ఛాంపియన్‌షిప్స్‌లో పాల్గొనేందుకు నబీలా చేసిన ప్రయాణం కూడా ప్రత్యేకమే. బొగోటా నుంచి టొరంటో, లండన్, ముంబై మీదుగా అహ్మదాబాద్ చేరుకోవడానికి ఆమె దాదాపు 48 గంటల ప్రయాణం చేసింది. ఆ కష్టం చివరకు ఫలించింది. అర్జెంటీనా నుంచి ఏకైక ప్రతినిధిగా బరిలోకి దిగిన నబీలా, ట్విస్టింగ్ బాడీ ఇండివిడ్యువల్, బ్యాక్ బెండ్ ఇండివిడ్యువల్ విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించింది. ఈ విజయంతో అర్జెంటీనా, కొలంబియా దేశాల్లో మరింత మంది యోగాసనపై ఆసక్తి చూపుతారని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది.
Read Also: ఇకపై బైక్ హ్యాండిల్ వదిలేస్తే దబిడి దిబిడే
Follow Us On : WhatsApp

