Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కోరుతూ ఏఐటీయూసీ ధర్నా

కలం, కరీంనగర్ బ్యూరో : ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసి ఆర్టీసీని పరిరక్షించాలని, ఈనెల 22న జరిగే సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ఏఐటీయూసీ (AITUC) ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు శనివారం కరీంనగర్ (Karimnagar) వన్ డిపో ముందు ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, రాష్ట్ర జేఏసీ ఉపాధ్యక్షులు థామస్ రెడ్డి మాట్లాడుతూ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఉద్యోగులకు పూర్తి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

2021 వేతన సవరణను 30 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలని, 2025 వేతన సవరణను వెంటనే అమలు చేయాలని వారు కోరారు. అలాగే మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం చెల్లించాల్సిన నిధులను నెలకు రూ.400 కోట్లు ఆర్టీసీకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బ్రెడ్ విన్నర్ పోస్టులను శాశ్వత ఉద్యోగాలుగా మార్చాలని, ట్రేడ్ యూనియన్‌లపై ఉన్న ఆంక్షలు ఎత్తివేయాలని, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని వారు కోరారు. డ్రైవర్లు, కండక్టర్లపై పనిభారం తగ్గించాలని కూడా విజ్ఞప్తి చేశారు.

ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వాలని, అద్దె బస్సు డ్రైవర్లను ఆర్టీసీలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. మహిళా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ఖాళీలను భర్తీ చేయాలని, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు జరిగే సమ్మెకు ప్రజలు సహకరించాలని నేతలు కోరారు. ఈ కార్యక్రమంలో రీజినల్ కార్యదర్శి కాళిదాస్, రీజినల్ జేఏసీ చైర్మన్ ఎంపీ రెడ్డి, వైస్ చైర్మన్ కొమురయ్య యాదవ్, నాయకులు బి మహేష్, శంకర్ రెడ్డి, ఎంవీఆర్ రెడ్డి, మనోహర్, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.

 Read Also: జాతినుద్దేశించి మోదీ ప్రసంగం : ‘బిల్లు’పై కీలక వ్యాఖ్యలు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>