ఇది ఎలక్షన్ కమిషన్ కాదు.. మోదీ సెలక్షన్ కమిషన్: AISF

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఎన్నికల కమిషన్ తన రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను విస్మరిస్తోందనీ, ఏఐఎస్ఎఫ్ (AISF) మహబూబ్‌నగర్ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ అన్నారు. మంగళవారం స్థానిక ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్యానికి రక్షణ కవచంగా ఉండాలి తప్ప, అధికారంలో ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసే సంస్థగా మారకూడదని ఆయన ఘాటుగా విమర్శించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పేరుతో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించబడితే ప్రజాస్వామ్య హక్కులకు తీవ్ర విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటు హక్కు అనేది పాలకులు ప్రజలకు ఇచ్చే భిక్ష కాదని, రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య హక్కు అని స్పష్టం చేశారు.

ఓటు హక్కు కోల్పోకుండా చర్యలు తీసుకోవాలి..

ఓటర్ల జాబితాల సవరణలో పూర్తి పారదర్శకత పాటించాలని, అర్హులైన ఒక్క ఓటరు కూడా తన ఓటు హక్కును కోల్పోకుండా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఓటర్ల పేర్ల తొలగింపునకు సంబంధించి స్పష్టమైన సమాచారం, తగిన నోటీసులు, అభ్యంతరాలు తెలియజేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వంతో సహా ఏ ప్రభుత్వ ఒత్తిడికీ తలొగ్గకుండా ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా పనిచేయాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటరే అసలైన నిర్ణేత అని, ప్రజల ఓటు హక్కును బలహీనపరిచే ఏ చర్యనైనా ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉందని పేర్కొన్నారు.

అనుమానాలకు తావిచ్చేలా..

ఎన్నికల కమిషన్ ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాల్సింది పోయి, అనుమానాలకు తావిచ్చేలా వ్యవహరిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థకే నష్టం కలుగుతుందని లక్ష్మణ్ హెచ్చరించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు, అవకతవకలు జరగకుండా ఎన్నికల కమిషన్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, యువత, ప్రజాస్వామ్యవాదులు ఐక్యంగా నిలబడి ఓటు హక్కు పరిరక్షణ కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>