ఇందిరమ్మ టవర్స్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన ఖుష్బూ గుప్తా

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ టవర్స్ (Indiramma Towers) నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా (Collector Khushboo Gupta) శుక్రవారం సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మహబూబ్‌నగర్ జిల్లా బండమీదిపల్లి (పాలమూరు విశ్వవిద్యాలయం సమీపంలో) మొత్తం ఐదు ఎకరాల విస్తీర్ణంలో 480 ప్లాట్ల నిర్మాణానికి కేటాయించిన ఈ భూమి భౌగోళిక పరిస్థితులను ఆమె సమీక్షించారు. ​

ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి కేటాయించిన ఈ స్థలం అనుకూలతతో పాటు భవిష్యత్తులో ఇక్కడ చేపట్టబోయే నిర్మాణ ప్రణాళికలు, నివాసితులకు అవసరమైన తాగునీరు, విద్యుత్, అంతర్గత రహదారులు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన అంశాలను కలెక్టర్ అధికారులతో కలిసి ప్రాథమికంగా అంచనా వేశారు. ​ఇందిరమ్మ టవర్స్‌లో ఇళ్లు పొందేందుకు అర్హులైన పేద కుటుంబాల నుంచి ప్రస్తుతం మీ-సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు.

దరఖాస్తుల సమర్పణకు డిసెంబర్ 5వ తేదీ చివరి గడువు అని స్పష్టం చేశారు. అర్హులైన ఇళ్లులేని బి.పి.ఎల్ కుటుంబాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, గడువు లోపు మీ-సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ​ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి. మధుసూదన్ నాయక్, హౌసింగ్ పీడీ ఉపేందర్ రెడ్డి, టూ-బీహెచ్‌కే ఏఈ జె.ఆర్.ఎస్. కుమార్, మహబూబ్‌నగర్ అర్బన్ తహసీల్దార్ ఘన్సిరాం, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>