కలం, తెలంగాణ బ్యూరో: మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ (AIMIM) దూకుడు ప్రదర్శన కనబర్చింది. బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ)తోపాటు పలు కార్పొషన్లు, మున్సిపాలిటీల్లో ఎంఐఎం అభ్యర్థులు విజయం సాధించారు. ఛత్రపతి శంభాజీనగర్ (ఔరంగబాద్) మున్సిపల్ కార్పొరేషన్ లో బీజేపీ మొదటి స్థానంలో నిలువగా.. రెండో ప్లేస్ కు మజ్లిస్ చేరుకుంది. ఇక్కడ మొత్తం 115 స్థానాలకు గాను బీజేపీ 58, మజ్లిస్ 33, శివసేన 12 చోట్ల గెలుపొందాయి. కాంగ్రెస్ కేవలం ఒక్క సీటుకే పరిమితమైంది.
బీఎంసీలో పతంగికి ఆరు!
కీలకమైన బృహన్ ముంబై కార్పొరేషన్ (BMC) లోనూ మజ్లిస్ పార్టీ(AIMIM) దాదాపు ఆరు సీట్లను గెలుచుకుంది. థాక్రేలకు కంచుకోటగా ఉన్న ఈ కార్పొరేషన్ ను అధికార బీజేపీ, శివసేనతో కూడిన మహాయుతి కూటమి కైవసం చేసుకుంది. దాదాపు 88 స్థానాల్లో బీజేపీ, 29 స్థానాల్లో శివసేన (షిండే) గెలుపొందాయి. రాజ్ థాక్రే, ఉద్దవ్ థాక్రే కలిసి పోటీ చేసినప్పటికీ అనుకున్నంత ప్రభావం చూపలేకపోయారు. అసదుద్దీన్ ఒవైసీ సారథ్యంలోని ‘పతంగి’ పార్టీ ఆరు స్థానాల్లో సత్తా చాటింది. మహారాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో మజ్లిస్ దాదాపు 94 స్థానాలను గెలుచుకుంది. పలు చోట్ల లీడింగ్ కనబర్చింది.


