కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో సంచలనం సృష్టించిన జనగామ, యాదాద్రి జిల్లాల్లో జరిగిన ధరణి- భూభారతి కుంభకోణం (Bhu Bharati Scam) కేసులో 15 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 8 మంది పరారీలో ఉండగా వారి నుంచి భారీగా నగదు, ఆస్తి పత్రాలు, కారు, ల్యాప్ ట్యాప్ లు, కంప్యూటర్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాన నిందితులైన పసునూరి బసవరాజు, జెల్లా పాండ్ యాదగిరిగుట్టలో ఆన్‌లైన్ సర్వీస్ సెంటర్లతో కలిసి పనిచేస్తూ, చలాన్ మొత్తాలను ఎడిట్ చేసి తక్కువ మొత్తం చెల్లించి మిగిలిన డబ్బును దోచుకున్నారు.
మధ్యవర్తులకు 10 నుంచి 30 శాతం వరకు కమిషన్ ఇచ్చి ఈ మోసానికి పాల్పడ్డారు. దీని ద్వారా దాదాపు రూ.3.90 కోట్లు ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారు. ఈ కుంభకోణానికి సంబంధించి 22 కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు శుక్రవారం ముఠా సభ్యులను అరెస్టు చేశారు. ప్రతిభ కనబరిచిన జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఎఎస్పీ వందరి చేతన్, ఇన్స్పెక్టర్లు సత్యనారాయణ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి లను సీపీ అభినందించారు.


