కలం, వెబ్ డెస్క్ : భారత రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు కేపీ ఉన్నికృష్ణన్ (Unnikrishnan) మంగళవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, కేరళలోని కొజికోడ్‌లో ఉన్న ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1980, 1990వ దశకాల్లో జాతీయ రాజకీయాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు.
ఉన్నికృష్ణన్ కేరళలోని వడకర నియోజకవర్గం నుంచి వరుసగా ఆరుసార్లు లోక్‌సభకు ఎన్నికై రికార్డు సృష్టించారు. 1971లో మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పార్లమెంటులో అడుగుపెట్టిన ఆయన, ఆ తర్వాత 1977, 1980, 1984, 1989 మరియు 1991 ఎన్నికలలో వరుస విజయాలను అందుకున్నారు. 1989-90 కాలంలో వీపీ సింగ్ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసి దేశానికి విశేష సేవలు అందించారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

