కలం, వెబ్ డెస్క్ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అడ్డుపెట్టుకుని కేటుగాళ్లు సరికొత్త మోసాలకు తెరలేపుతున్నారు. తాజాగా విశాఖపట్నంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పేర్లతో ఒక హైటెక్ సైబర్ మోసం (AI Cyber Fraud) వెలుగుచూసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వాడుకుని నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టారు.
విశాఖపట్నంలోని సీతంపేట ప్రాంతానికి చెందిన శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తికి ఒక ల్యాండ్ వివాదం ఉంది. దీనిని పరిష్కరిస్తామంటూ సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగారు. ముందుగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఫోటోతో ఒక వాట్సప్ ఖాతాను తెరిచి బాధితుడిని నమ్మించారు. ఆ తర్వాత ఏఐ సాంకేతికతతో సృష్టించిన సీఎం చంద్రబాబు డీప్‌ఫేక్ వీడియో కాల్‌ను శ్రీనివాసరెడ్డికి చేశారు. నిజంగానే ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని నమ్మిన బాధితుడు, వారు అడిగినట్లుగా విడతలవారీగా మొత్తం రూ.80 వేల రూపాయలను కేటుగాళ్ల ఖాతాకు బదిలీ చేశాడు. ఆ తర్వాత ఎంతకీ పని కాకపోవడం, సదరు వ్యక్తుల నుండి స్పందన కరువవడంతో తాను మోసపోయానని శ్రీనివాసరెడ్డి గ్రహించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు విశాఖపట్నం సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

