కలం, కరీంనగర్ బ్యూరో: 2027లో జరిగే గోదావరి పుష్కరాలకు వచ్చే సామాన్య ప్రజలకు, వీఐపీలకు ఇలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Adluri Laxman) స్పష్టం చేశారు. మంగళవారం ధర్మపురిలో పుష్కర ఏర్పాట్లను దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తోపాటు వివిధ శాఖల అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా అడ్లూరి మాట్లాడుతూ.. 2027లో నిర్వహించే గోదావరి పుష్కరాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా బాసర నుంచి భద్రాచలం వరకు దేవాలయాల అభివృద్ధి పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యం కోసం రూ.1,000 కోట్లుకేటాయించినట్లు వివరించారు.
రూ. 117 కోట్లు కేటాయింపు..
ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మపురి, కోటిలింగాల క్షేత్రాల అభివృద్ధికి రూ. 117 కోట్లు కేటాయించారని మంత్రి అడ్లూరి వివరించారు. ధర్మపురిలో శ్రీ ఉగ్ర నరసింహ స్వామి దేవాలయం అభివృద్ధితో పాటు వీఐపీ ఘాట్ల నిర్మాణం చేయనున్నట్లు వివరించారు. అదేవిధంగా కోటిలింగాల దేవస్థానం అభివృద్ధితో వెల్గటూరు ప్రధాన రహదారి నుండి కోటిలింగాల వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణం చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ధర్మపురిలోని అమ్మ ఫంక్షన్ హాల్ నుండి రాజారం రోడ్డు వరకు ప్రత్యేక రహదారి నిర్మాణం కోరకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.
రానున్న రోజుల్లో ధర్మపురి మాస్టర్ ప్లాన్..
ధర్మపురిలో పుష్కరాల పనుల కోరకు మరో రూ.60 కోట్ల నిధులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని ఆలయాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చే విధంగా రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. బాసర, భద్రాచలం, కాళేశ్వరం ఆలయాలకు మాస్టర్ ప్లాన్ తో టెంపుల్ సిటీగా తీర్చిదిద్దే కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఇప్పటికీ పనులు చేపట్టారని అన్నారు. రానున్న రోజుల్లో ధర్మపురి మాస్టర్ ప్లాన్ టెంపుల్ సిటీ (Dharmapuri Temple Master Plan) నిర్మాణానికి కృషి చేస్తానని మంత్రి వివరించారు.
అంతకుముందు ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ తో పాటు దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో పనిచేస్తున్న పూజారుల వేతనాల పెంపు పత్రాలను ఈ సందర్భంగా వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి మున్సిపల్ చైర్మన్ వేముల నాగలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంఘనభట్ల దినేష్ తోపాటు ధర్మపురి మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

