కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చంద్రుగొండ మండలంలో మంగళవారం జిల్లా కలెక్టర్ అంకిత్ (Collector Ankit) విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా చండ్రుగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన, విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనంలో సాంబార్ పలుచగా ఉండటాన్ని గమనించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పోషక విలువలు కలిగిన నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, పరిశుభ్రత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల సమగ్రాభివృద్ధికి విద్యతో పాటు వాలీబాల్, కబడ్డీ వంటి క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇచ్చి వారిని ప్రోత్సహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
అంతకుముందు తిప్పనపల్లి గ్రామంలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌కు సంబంధించిన భూసేకరణ సర్వే పనులను కలెక్టర్ పరిశీలించారు. నిర్దేశిత 70 ఎకరాల సర్వేను పారదర్శకంగా, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తి చేయాలన్నారు. భూముల్లోని బోర్లు, ఆయిల్ పామ్ తోటల వివరాలను క్షుణ్ణంగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం మద్దుకూరు గ్రామంలో ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను తనిఖీ చేస్తూ, ఇప్పటివరకు పూర్తయిన 65 శాతం డిజిటలైజేషన్‌ను అడిగి తెలుసుకున్నారు. మిగిలిన ప్రక్రియను ఎన్నికల సంఘం గడువులోగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో కొత్తగూడెం ఆర్డీవో మధు, తహసీల్దార్ జగదీశ్వరరావు, ఎంపీడీవో అశోక్, ఇరిగేషన్, సర్వే శాఖల అధికారులు పాల్గొన్నారు.
మంత్రుల పర్యటన ఏర్పాట్ల పరిశీలన
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల జిల్లా పర్యటన నేపథ్యంలో కలెక్టర్ అంకిత్ క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రులు జిల్లాలోని సీతమ్మసాగర్, సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టులను సందర్శించడంతో పాటు నిర్వహించనున్న సమీక్షా సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

