కలం, ఆదిలాబాద్: భారత రాజ్యాంగం దేశంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కల్పిస్తూ అందరికీ రక్షణగా నిలుస్తోందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ (MLA Anil Jadhav) అన్నారు. 77వ రాజ్యాంగ దినోత్సవాన్ని (Constitution Day) పురస్కరించుకుని గురువారం ఆదిలాబాద్ (Adilabad) జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ మంత్రి జోగు రామన్న పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా గుర్తింపు పొందిందన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కల్పించిన హక్కుల వల్లే తాను నేడు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కిందని పేర్కొన్నారు. స్వతంత్ర భారతదేశంలో కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించిన గొప్ప రాజ్యాంగం అందరికీ నీడనిస్తోందన్నారు. అంబేద్కర్ ఏ ఒక్క వర్గానికో పరిమితం కాదని, ఆయన అందరివాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

