విద్యార్థుల భవిష్యత్‌పై కలెక్టర్ కీలక సూచనలు

కలం, నిర్మల్: విద్యార్థులు క్రమశిక్షణతో చదువుతూ ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని జిల్లా కలెక్టర్ (Adilabad Collector) రాజర్షిషా (Rajarshi Shah) సూచించారు. గురువారం బజార్‌హత్నూర్ (Bazarhatnoor) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన బాలుర వసతి గృహాన్ని స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్యతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బజార్‌హత్నూర్‌లో ఎస్సీ, బీసీ విద్యార్థుల కోసం నూతన హాస్టల్ భవనాల నిర్మాణానికి త్వరలోనే పరిపాలనాపరమైన అనుమతులు మంజూరయ్యే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు త్వరలోనే బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. కొల్హారిలో హరిరామ్, హరికృష్ణ అందించిన గోడౌన్‌ను ఈ కార్యక్రమం కోసం వినియోగించుకోనున్నట్లు వెల్లడించారు.

విద్యార్థులు ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని వ్యక్తిగత పరిశుభ్రత, మంచి అలవాట్లను అలవర్చుకోవాలని సూచించారు. సమాచార మార్పిడి, కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులను వినియోగించుకోవాలని తెలిపారు. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్, ఖాన్ అకాడమీ వంటి డిజిటల్ వేదికల ద్వారా ఆధునిక పద్ధతుల్లో విద్యను అభ్యసించాలని సూచించారు. విద్యార్థులకు త్వరలో కొత్త యూనిఫాంలు, షూలు అందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

విద్యార్థులు ప్రతిరోజూ క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై ప్రతి సబ్జెక్టును క్షుణ్ణంగా అభ్యసించాలని సూచించారు. చిన్ననాటి నుంచే కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం ఉంటుందని అన్నారు. పదో తరగతి విద్యార్థులు ఇప్పటి నుంచే లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి చదివి అత్యుత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ముఖ్యంగా బాసర ట్రిపుల్‌ఐటీలో సీట్లు సాధించేలా విద్యార్థులు పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>