వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట: కలెక్టర్ రాజర్షిషా

కలం, ఆదిలాబాద్: వయోవృద్ధుల సంక్షేమం, భద్రతకు జిల్లా యంత్రాంగం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని జిల్లా కలెక్టర్ రాజర్షిషా (Rajarshi Shah) స్పష్టం చేశారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో వృద్ధుల కోసం ప్రత్యేకంగా వృద్ధాశ్రమం, ప్రణాం డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. వారికి మెడికల్ హెల్ప్ క్యాంపులు, కంటి పరీక్షలు, ప్రభుత్వ పరంగా అందవలసిన పుస్తకాలు, సంక్షేమ ఫలాలను అందిస్తున్నట్లు వెల్లడించారు. ఉద్యోగులు లేదా ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే తమ తల్లిదండ్రులను, వయోవృద్ధులను సరిగా చూసుకోకపోతే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.

నిర్ల‌క్ష్యం చేస్తే జీతంతో కోత‌

బాధ్యత విస్మరించి వృద్ధులను నిర్లక్ష్యం చేస్తే, వారి జీతం నుంచి ఆటోమేటిక్‌‌గా కోత విధించి నేరుగా వృద్ధులకు అందించేలా చట్టపరమైన నిర్ణయం తీసుకున్నామని క‌లెక్ట‌ర్ చెప్పారు. ఇది ఇప్పటికే అసెంబ్లీలో ఆమోదం పొంది అమల్లోకి వచ్చిందన్నారు. అదేవిధంగా, గతంలో భావోద్వేగంతో పిల్లలకు రాసిచ్చిన భూములను.. ఆ తర్వాత వారు సరిగ్గా చూసుకోకపోతే తిరిగి వెనక్కి పొందేలా చట్టంలో వెసులుబాటు ఉందని అన్నారు. ఇలాంటి సమస్యలు ఎదురైతే వయోవృద్ధులు నేరుగా తనకు దరఖాస్తు చేసుకోవచ్చని, వెంటనే స్పందించి న్యాయం చేస్తామని భరోసానిచ్చారు. జపాన్ తరహాలో రాబోయే రోజుల్లో మన దేశంలోనూ వయోవృద్ధుల సంఖ్య పెరుగుతుందని, ఆ సమాజానికి తగినట్లుగా వారి ఆరోగ్యం, డే కేర్ కార్యకలాపాలు, రక్షణ బాధ్యతలను ప్రతి ఒక్కరూ విస్మరించకుండా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం పలువురు వయోవృద్ధులను కలెక్టర్ శాలువాతో సత్కరించి, మెమొంటో అందజేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>