కమలాపురం పైలట్ గ్రామంగా ‘భూ భారతి’ రీ సర్వే షురూ!

కలం, సింగరేణి: ఏళ్ల తరబడి భూ వివాదాలకు, నకిలీ పట్టాల ఆరోపణలకు, రెవెన్యూ రికార్డుల్లోని అవకతవకలకు అడ్డాగా మారిన భూ సమస్యలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘భూ భారతి’ (Bhu Bharati) రీ సర్వే కీలకంగా మారనుంది. భూమి లేకుండానే పట్టాలు పొందిన వారి గుట్టు రట్టు చేసే ఈ సర్వే ప్రక్రియ అక్రమ పట్టాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఈ పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలోని కమలాపురం (Kamalapuram) గ్రామాన్ని పైలట్ గ్రామంగా ఎంపిక చేసి, శుక్రవారం మండల తహశీల్దార్ ఓరుగంటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రీ సర్వేను అధికారికంగా ప్రారంభించారు.

రెవెన్యూ రికార్డుల ప్రకారం కమలాపురం గ్రామంలో 1,185 మంది రైతులకు సంబంధించి మొత్తం 1,836 ఎకరాల భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 196 ఎకరాలు ప్రభుత్వ భూమిగా నమోదై ఉన్నట్లు తహశీల్దార్ వెల్లడించారు. తొలుత గ్రామ సరిహద్దులను పక్కాగా నిర్ణయించి, ప్రభుత్వ భూముల హద్దులను నిర్ధారించనున్నారు. అనంతరం పట్టాల్లో నమోదైన విస్తీర్ణానికి, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ సాగు భూమికి మధ్య ఉన్న తేడాలను నిశితంగా పరిశీలిస్తారు. ఒకరి భూమి మరొకరి పేరుపై నమోదు కావడం, ప్రభుత్వ భూములను వ్యక్తిగత భూములుగా చూపించడం వంటి అక్రమాలను రికార్డుల ఆధారంగా తేల్చనున్నారు.

తప్పుడు వివరాలతో అక్రమంగా పట్టాలు పొందినట్లు విచారణలో తేలితే, ఆ పట్టాల ఆధారంగా గతంలో రైతుబంధు, రుణమాఫీ వంటి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందారా అనే కోణంలోనూ అధికారులు విచారణ జరిపే అవకాశం ఉంది. అర్హత లేకుండా ప్రభుత్వ నిధులు పొందినట్లు నిర్ధారణ అయితే, సంబంధిత వ్యక్తులకు వివరణ ఇచ్చే అవకాశం కల్పించిన అనంతరం నిబంధనల ప్రకారం రికవరీ చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది.

రీ సర్వేకు హాజరయ్యే రైతులు ఆధార్ కార్డు, మొబైల్ నంబర్, పట్టా పాస్ పుస్తకాలు, కొనుగోలు పత్రాలు, వారసత్వ పత్రాలు, ఇతర భూ హక్కులకు సంబంధించిన ఆధారాలను అందించాలని అధికారులు సూచించారు. అలాగే ప్రస్తుతం వివాదాల్లో ఉన్న, రెవెన్యూ రికార్డుల్లో స్పష్టత లేని భూములను ప్రస్తుత సర్వేలో పెండింగ్‌లో ఉంచి, తదుపరి విడతలో పరిష్కరిస్తామని తెలిపారు. ​

ఈ కార్యక్రమంలో సర్వేయర్ వి. వినయ్ కుమార్, లైసెన్స్ సర్వేయర్ సంతోష్, ఆర్ఐలు జగదీష్, ఆలీ అక్బర్, జీపీఓలు రాందాస్, వీరన్న, స్థానిక ఉపసర్పంచ్ బానోత్ స్వాతి తదితరులు పాల్గొన్నారు. కమలాపురంలో మొదలైన ఈ పైలట్ సర్వే ద్వారా భూ రికార్డుల్లోని అక్రమాలు వెలుగులోకి వచ్చి, ఏళ్లుగా భూములను సాగు చేసుకుంటున్న అసలైన రైతులకు న్యాయం జరుగుతుందా అనేది ఇప్పుడు స్థానిక రైతాంగంలో చర్చనీయాంశంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>