కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (Mahabubnagar GGH) లో పారిశుద్ధ్యం, వైద్యశాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. మంగళవారం ఆయన ఆసుపత్రిలోని వివిధ విభాగాలను ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణంలోని పారిశుద్ధ్య నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, కిచెన్‌ను తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, పరిశుభ్రత, పోషక విలువలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో రోగులకు కల్పిస్తున్న వైద్య సదుపాయాలు, మౌలిక వసతుల గురించి ఆరా తీశారు. అనంతరం చిన్నపిల్లల ఎన్‌ఐసీయూ కేంద్రాన్ని సందర్శించి, నవజాత శిశువులకు అందిస్తున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న వైద్య పరికరాలు, చికిత్సా సదుపాయాలను పరిశీలించారు.
ఆసుపత్రి (Mahabubnagar GGH) ప్రాంగణంలో నిర్వహిస్తున్న సదరం శిబిరాన్ని కూడా సందర్శించి, దివ్యాంగులకు చేపడుతున్న వైద్య పరీక్షలు, అంగవైకల్య నిర్ధారణ ప్రక్రియ, శిబిరంలో కల్పించిన సదుపాయాలను పరిశీలించారు. అర్హులైన దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య పరీక్షలు నిర్వహించి, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సేవలు అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఆసుపత్రిలో పారిశుద్ధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, రోగులకు నాణ్యమైన ఆహారంతో పాటు మెరుగైన వైద్య సేవలు అందేలా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్‌తో పాటు ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.రంగా అజ్మీరా తదితరులు ఉన్నారు.
Also Read : అమిత్ షాకు ఎంపీ చామల కౌంటర్
Follow Us On : WhatsApp

