కలం, జోగులాంబ గద్వాల: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా పడటంతో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ మధుమోహన్ (Madhumohan) అన్నారు. సోమవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. గద్వాల మండలం చెనుగోనుపల్లి గ్రామ రైతు వేదిక నుంచి అదనపు కలెక్టర్ మధుమోహన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. రబీ సీజన్‌లో ఎట్టి పరిస్థితుల్లో రైతులు వరి సాగు చేయవద్దన్నారు. బిందు సేద్యంతో ఆయిల్ పామ్ తోటలు, కూరగాయలు వంటి స్వల్పకాలిక పంటలను సాగు చేయవచ్చన్నారు. రాష్ట్రంలో 315 మండలాల్లో వర్షపాతం తక్కువగా ఉందన్నారు. వచ్చే వర్షాకాలం నాటికి తాగునీటి సమస్యలు రాకుండా నీటిని పొదుపుగా వాడాలని సూచించారు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరాపై సరైన ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. భూగర్భ జల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్ నివేదికలను అందజేయాలన్నారు.
ఎల్ నినో ఎదుర్కోవడానికి కార్యాచరణ..
అదనపు కలెక్టర్ మధుమోహన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సూచనలను అనుసరించి రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలని తెలిపారు. ఎల్ నినో వంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తామన్నారు. ఆరుతడి పంటల సాగుపై రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కలిగేందుకు విస్తృతంగా అన్ని మాధ్యమాల ద్వారా, కళాజాత బృందాలతో ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామన్నారు.
రైతులు నష్ట పోకుండా ముందస్తుగా అప్రమత్తం చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కృషి చేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచి పద్మమ్మ, నీటిపారుదల శాఖ ఇన్‌ఛార్జి ఎస్ఈ శ్రీనివాసులు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రాజ్ కుమార్, రాజశేఖర్, వ్యవసాయ శాఖ ఏవోలు ప్రతాప్ కుమార్, సాజిద్, ఏఈఓ ప్రవళిక, పంచాయతీ కార్యదర్శి రామ నర్సింహులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

