కలం, వెబ్ డెస్క్: చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య (Kale Yadaiah)కు నిరసన సెగ తగిలింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఆరుగురి హత్య కేసులో నిందితుడు రాజ్ కుమార్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మృతుల బంధువులు, కుటుంబసభ్యులు శనివారం మధ్యాహ్నం షాద్నగర్-చేవెళ్ల రహదారిపై భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టర్ నారాయణ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు.
ఇదే సమయంలో ఎమ్మెల్యే కాలె యాదయ్య అక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్యే రాకతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆందోళనకారులు ఆయన మీదకు దూసుకెళ్లారు. రాజ్ కుమార్ పోక్సో కేసులో నిందితుడిగా ఉన్నా, ఘటన జరిగి 55 రోజులు గడుస్తున్నా ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీస్తూ ఆయన పై దాడికి యత్నించారు. దీంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి పరుగెత్తుకుంటూ వెనక్కి వెళ్లిపోయారు. పోలీసులు ఆయనకు రక్షణ కల్పిస్తూ కారు వరకు జాగ్రత్తగా తీసుకెళ్లారు. అయితే కొంతమంది కావాలనే కుట్రలు చేసి వారిని రెచ్చగొడుతున్నారని ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు.
మరోవైపు ప్రజల ఆందోళనతో షాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. షాబాద్ మండలం దైవాలగూడకు చెందిన రాజ్ కుమార్ పోక్సో కేసులో నిందితుడిగా ఉన్నాడు. బెయిల్పై విడుదలై తనపై కేసు పెట్టిన మైనర్ బాలిక, ఆమె తల్లితో పాటు తన భార్యా పిల్లలను మరో వృద్ధురాలిని చంపేశాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

