కలం, కరీంనగర్: మహాత్మా జ్యోతిరావు ఫూలే (Jyotirao Phule) ఆశయ సాధనకు, ఆయన చూపిన సమసమాజ స్థాపన మార్గంలో పయనించేందుకు నేటి యువతతో పాటు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావు పిలుపునిచ్చారు. సమాజంలోని అసమానతలను రూపుమాపేందుకు ఫూలే చేసిన త్యాగాలు మరువలేనివని, మహిళా సాధికారతకు ఆనాడే బలమైన పునాదులు వేశారని కొనియాడారు.
మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతిని పురస్కరించుకుని కరీంనగర్ బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నగరంలో సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. విద్యానగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ సమీపంలో ఉన్న ఫూలే విగ్రహానికి నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నాయకులు, కార్యకర్తలు ఫూలే సేవలను స్మరించుకుంటూ జోహార్లు అర్పించారు.
ఈ సందర్భంగా యాదగిరి సునీల్‌రావు మాట్లాడుతూ.. ఫూలే ఆశయాలు, పోరాటం నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. సమాజంలో పాతుకుపోయిన కుల వివక్ష, మూఢాచారాలకు వ్యతిరేకంగా ఆయన అలుపెరగని పోరాటం చేశారని గుర్తుచేశారు. మహిళలు ఇంటి గడప దాటి బయటకు రాని పరిస్థితుల్లో తన సతీమణి సావిత్రిబాయి ఫూలేను చదివించి దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దారని తెలిపారు. మహిళలందరికీ విద్య అందించేందుకు గొప్ప ఉద్యమాన్ని చేపట్టారని, మహిళలు విద్యావంతులైతేనే సమాజం అభివృద్ధి చెందుతుందని ఆనాడే ఆలోచించిన గొప్ప దార్శనికుడు ఫూలే అని కొనియాడారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంటులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం ఫూలే ఆశయాలకు అనుగుణంగా సాగుతున్న మహిళా సాధికారతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఫూలే వర్ధంతి సందర్భంగా ఆయన ఆశయాలను పాటిస్తూ, సమసమాజ స్థాపనకు కృషి చేస్తూ ప్రజలకు సేవ చేస్తామని పునరంకితమవుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్, కార్పొరేటర్లు బోయినిపల్లి ప్రవీణ్‌రావు, ఎన్నం ప్రకాష్, గాజ శివరాం, కర్రే అనిల్‌కుమార్, బీజేపీ నాయకులు గుజ్జ శ్రీనివాస్, అడిచెర్ల రాజు, రాచకొండ కొమురయ్య, పుప్పాల రఘు, వంగల రవి, మోతే గంగారెడ్డి, గర్థస్ సతీష్, కడర్ల రతన్, బాలరెడ్డి, సత్తిరెడ్డి, సంఘం నరేష్‌తో పాటు ఓబీసీ మోర్చా నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

