కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లా సత్తుపల్లి (Sathupalli) మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేశారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఏసీబీ డీఎస్పీ వై. రమేశ్ ఆధ్వర్యంలో మూడు బృందాలతో ఈ తనిఖీలు చేపట్టారు. కార్యాలయం గేట్లు మూసి వేసి లోపల పలు రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భవన నిర్మాణ అనుమతులు, బిల్లుల చెల్లింపులు, పన్నుల వసూళ్లలో ఉన్న లోపాలపై ఏసీబీ అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. పలువురు అధికారులు, సిబ్బందిని విడివిడిగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ వై. రమేశ్ మీడియాతో మాట్లాడుతూ… సత్తుపల్లి (Sathupalli) మున్సిపల్ కార్యాలయంపై తమకు పలు ఫిర్యాదులు అందాయని తెలిపారు. మున్సిపాలిటీలో ఇంటి పన్నులు, నీటి పన్నులు వసూలు చేయడంలో జాప్యం జరిగినట్లు గుర్తించామన్నారు. అలాగే సిబ్బంది గైర్హాజరు విషయంలోనూ లోపాలు ఉన్నాయని, కార్యాలయ పరిపాలనలో పలు లోపాలు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. డీజీ ఆదేశాల మేరకు ఈ సోదాలు నిర్వహిస్తున్నామన్నారు. మునిసిపల్ కమిషనర్ నివాసంలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అయితే మునిసిపల్ మేనేజర్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించాల్సి ఉండగా… ప్రస్తుతం ఆయన అందుబాటులో లేడని ఇంటికి తాళం వేసి ఉందని తెలిపారు. మొత్తం వ్యవహారాన్ని సమగ్రంగా పరిశీలించి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని ఇంకా సోదాలు కోనసాగుతున్నాయని డీఎస్పీ వివరించారు.

