కలం, వెబ్ డెస్క్ : తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో (TTD Deputy EO) మెండు లోకనాథంపై అవినీతి నిరోధక శాఖ చర్యలు చేపట్టింది. ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు, బుధవారం ఉదయం నుంచే విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు. తిరుపతిలోని పెద్దకాపు లేఅవుట్లో ఉన్న ఆయన నివాసంలో ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి.
ఈ సోదాల సమయంలో టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లోనే ఉన్నారు. కేవలం ఆయన నివాసానికే పరిమితం కాకుండా, ఏకకాలంలో ఐదు వేర్వేరు ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు తనిఖీలు చేపడుతున్నాయి. తిరుపతిలో ఉన్న ఆయన ఇద్దరు బావమరుదుల ఇళ్లతో పాటు ఏర్పేడు మండలం చెల్లూరులోని ఆయన సోదరుడి నివాసంలోనూ అధికారులు సోదాలు చేస్తున్నారు.
మరోవైపు తిరుమలలోని లోకనాథం కార్యాలయంలో కూడా ఏసీబీ బృందాలు సోదాలు నిర్వహించి పలు కీలక రికార్డులను పరిశీలిస్తున్నాయి. ఈ తనిఖీల్లో కోట్ల రూపాయల విలువైన అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గురించినట్లు సమాచారం.

