కలం, వెబ్ డెస్క్: మాదాపూర్ (Madhapur) పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ (ACB) అధికారులు బుధవారం ఉదయం 5.30 గంటల వరకు సోదాలు నిర్వహించారు. ఓ వ్యక్తి నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటున్న మాదాపూర్ ఎస్సై (Madhapur SI) వినయ్‌ని అదుపులోకి తీసుకున్నారు. 2025లో ఓ వ్యక్తిపై చీటింగ్ కేసు నమోదైంది. ఈ కేసును కొట్టేయాలని పలుమార్లు పోలీస్ స్టేషన్‌కు వచ్చి అడిగాడు. కేసు కొట్టేయడానికి ఎస్సై వినయ్ రూ.50 వేల లంచం డిమాండ్ చేశాడు. సదరు వ్యక్తి లంచం ఇచ్చేందుకు అంగీకరించాడు. దీని కోసం మంగళవారం ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో ముందస్తు సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు మంగళవారం సాయంత్రం పోలీస్ స్టేషన్‌పై దాడులు చేశారు. లంచం తీసుకుంటున్న వినయ్‌ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని దాదాపు 15 గంటల పాటు విచారించారు. బుధవారం తెల్లవారుజామున 5.30 గంటల వరకు విచారణ కొనసాగింది. విచారణలో భాగంగా వినయ్ వెల్లడించిన అంశాల ఆధారంగా అధికారులు రిపోర్ట్ తయారు చేశారు. విచారణ అనంతరం వినయ్‌ని వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.


