కలం, వెబ్ డెస్క్ : దేశమంతా ఎండలు మండుతున్నాయి. ఉదయం సమయంలోనే కాకుండా రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు తీవ్రంగానే ఉంటున్నాయి. ఫ్యాన్ వేసుకుంటే వడగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కూలర్లు చేతులెత్తేస్తున్నాయి. ఈ సమయంలో కొద్దోగొప్పో ఉపశమనం కలిగిస్తున్నవి ఏసీలే. రాత్రివేళల్లో ఏసీ ఒక్క నిమిషం ఆగినా నిద్ర తేలిపోతోందంటే వేసవి వేడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగని ఏసీ ఆన్‌చేసే ఉంచుదామంటే కరెంటు బిల్లులు మోతమోగిస్తాయి. దీంతో మధ్యతరగతి వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ సమస్యకు పరిష్కారంగా ఇప్పుడు చాలా మంది భారతీయులు ఏసీలోని ‘స్లీప్ మోడ్’ ఫీచర్‌ను (AC Tips) ఎక్కువగా వాడుతున్నారు.
సాధారణంగా ఏసీని ఒకే టెంపరేచర్ దగ్గర ఉంచితే రాత్రి గడిచేకొద్దీ గది విపరీతంగా చల్లబడిపోతుంది. దీనివల్ల నిద్రలో ఇబ్బంది కలగడమే కాకుండా కరెంటు కూడా ఎక్కువగా ఖర్చవుతుంది. ఆధునిక ఏసీల్లో ఉండే ఈ ‘స్లీప్ మోడ్’ (AC Sleep Mode) ఆ ఇబ్బంది లేకుండా చేస్తుంది. మనం పడుకునే ముందు ఈ మోడ్ ఆన్ చేస్తే, అది గది ఉష్ణోగ్రతను నెమ్మదిగా మారుస్తుంది. ప్రతి గంటకు అర డిగ్రీ నుండి ఒక డిగ్రీ వరకు టెంపరేచర్‌ను పెంచుకుంటూ వెళ్తుంది. ఇలా చేయడం వల్ల కొన్ని గంటల తర్వాత గదిలో వాతావరణం మరీ చల్లగా కాకుండా, నిద్రకు హాయిగా ఉండేలా మారుతుంది.
చాలా మంది ‘స్లీప్ మోడ్’ కు, ‘ఎనర్జీ సేవర్ మోడ్’ కు మధ్య తేడా తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటారు. స్లీప్ మోడ్ అనేది కేవలం రాత్రి పూట మన సౌకర్యం కోసం టెంపరేచర్‌ను సర్దుబాటు చేస్తుంది. కానీ ఎనర్జీ సేవర్ మోడ్ అలా కాదు. గది మనం అనుకున్నంత చల్లగా అవ్వగానే ఏసీ కంప్రెషర్‌ను ఆపేస్తూ, మళ్లీ అవసరమైనప్పుడు ఆన్ చేస్తూ కేవలం కరెంటు ఆదా చేయడంపైనే దృష్టి పెడుతుంది.

