కలం, స్పోర్ట్స్ : ఐపీఎల్ చరిత్రలోనే కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) అత్యంత పేలవమైన ఆరంభాన్ని మూటగట్టుకుంది. ఆడిన మొదటి ఐదు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం కూడా నమోదు చేయలేక పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది. మంగళవారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కూడా సీఎస్‌కే (Chennai Super Kings) చేతిలో 32 పరుగుల తేడాతో ఓడిపోవడం కేకేఆర్ శిబిరంలో ఆందోళన కలిగిస్తోంది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నారు. సీఎస్‌కే బ్యాటర్లలో సంజు శాంసన్, ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్ క్రీజులో ఎక్కువ సమయం గడిపి ఇబ్బంది పెట్టినప్పటికీ.. సునీల్ నరైన్, ఇతర బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.
దీంతో చెన్నై జట్టును 192 పరుగులకే పరిమితం చేయడంలో బౌలింగ్ విభాగం సఫలమైంది. అయితే, లక్ష్య ఛేదనలో కేకేఆర్ బ్యాటర్లు మరోసారి చేతులెత్తేశారు. సీఎస్‌కే ఫీల్డర్లు మూడు క్యాచ్‌లు వదిలేసి లైఫ్ ఇచ్చినప్పటికీ, కేకేఆర్ బ్యాటర్లు ఆ అవకాశాలను వినియోగించుకోలేకపోయారు. ముఖ్యంగా అనుకూల్ రాయ్ వంటి ఆటగాడు తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్నాడంటే, జట్టు బ్యాటింగ్ లోతు ఎంత ఉందో అర్థమవుతోందని, కానీ ప్రదర్శన మాత్రం ఆ స్థాయిలో లేదని విమర్శలు వస్తున్నాయి.
జట్టు వైఫల్యంపై మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా (Aakash Chopra) స్పందిస్తూ.. కేకేఆర్‌కు గాయాల వల్ల బౌలింగ్ సమస్యలు ఉన్న మాట నిజమే అయినా, ప్రస్తుతం బ్యాటింగ్ విభాగమే జట్టును దెబ్బతీస్తోందని అభిప్రాయపడ్డారు. జట్టులో నాణ్యమైన బ్యాటర్లు ఉన్నప్పటికీ నిలకడగా ఆడలేకపోతున్నారని ఆయన పేర్కొన్నారు. కేకేఆర్ తన చరిత్రలోనే ఇలాంటి చెత్త ఆరంభాన్ని ఎప్పుడూ చూడలేదని ఆయన సోషల్ మీడియా వేదికగా విశ్లేషించారు.

