కలం డెస్క్: ఎంత బాగా ఆడినా తనను టీమిండియా సెలక్టర్లు పట్టించుకోవడం లేదని యంగ్ అండ్ డైనమిక్ ప్లేయర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) ఆవేదన వ్యక్తం చేశాడు. భారతజట్టులోకి రావడం కోసం తాను ఎంతో కష్టపడ్డానని, కానీ బ్లూజెర్సీ ధరించే అవకాశం రాకపోవడంతో చాలా నిరాశ చెందానని అన్నాడు. ఆ భావోద్వేగాలను అధిగమించి ముందుకు సాగానని చెప్పాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ–2025లో (Syed Mushtaq Ali Trophy) ఇషాన్ కిషన్ సారథ్యంలోని జార్ఖండ్ జట్టు విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్ పలు కీలక విషయాలు షేర్ చేసుకున్నాడు. ఫలితాల గురించి ఆలోచించకుండా తన ప్రయత్నాన్ని తాను కొనసాగిస్తున్నానని ఇషాన్ వివరించాడు. ఈ విజయం తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని క్షణమని అన్నాడు.
“భారత జట్టుకు ఎంపిక కానప్పుడు చాలా బాధపడ్డాను. నేను బాగా ఆడుతున్నప్పటికీ అవకాశం రాకపోవడం నిరాశకు గురి చేసింది. ఆ సమయంలో ఇంకా మెరుగ్గా ఆడాలని నాకే నేను చెప్పుకున్నాను. వ్యక్తిగత విజయాలకన్నా జట్టును గెలిపించడంపైనే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నా” అని ఆయన తెలిపారు. “నిరాశ ఎప్పుడూ మనల్ని ఒక అడుగు వెనక్కి నెట్టేస్తుంది. కాబట్టి దానికి లోనవ్వకుండా మరింత కష్టపడాలి. మీపై మీకు నమ్మకం ఉండాలి. లక్ష్యంపై పూర్తి దృష్టి పెట్టాలి. యువ ఆటగాళ్లకు నేను ఎప్పుడూ ఇచ్చే సలహా ఇదే” అని చెప్పాడు.
గురువారం హర్యానాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో జార్ఖండ్ 69 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ (Ishan Kishan) 49 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్సర్లతో 101 పరుగులు చేసి విధ్వంసకర సెంచరీ చేశాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. “నా కెప్టెన్సీలో ఇది తొలి దేశవాళీ టోర్నీ విజయం. ఇది మనల్ని మనం నిరూపించుకునే సమయం. కొన్నిసార్లు మనపై మనకే సందేహాలు కలుగుతాయి. కానీ ఇలాంటి విజయాలు ఆ అనుమానాలన్నింటినీ తుడిచేస్తాయి’’ అని అన్నాడు.
Read Also: ఇండియా ఖాతాలో మరో రెండు వరల్డ్ కప్స్.. ఈసారి ఏ గేమ్‌లో అంటే..!
Follow Us On: Pinterest


