కలం, వెబ్ డెస్క్ : కొత్త జీవితంపై కోటి ఆశలతో అత్తారింటిలో అడుగుపెడుతున్న అమ్మాయిలు నరకయాతనలు అనుభవిస్తున్నారు. పుట్టినింటిలో అల్లారు ముద్దుగా పెరిగిన వాళ్లు మెట్టినింటికి వెళ్లాక ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. అయినా అవన్నీ ఓర్చుకుని వివాహ జీవితాన్ని గడుపుతున్నారు. ఈ క్రమంలో వారిని వరకట్న పిశాచులు (Dowry Cases) మరింత పిక్కుతింటున్నాయి. అదనపు కట్నం కోసం అత్తమామలతో పాటు తాళికట్టిన భర్త కూడా హింసిస్తూ చంపేస్తున్నారు. పెద్దలు కుదిర్చిన వివాహల్లోనే కాకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్నా వరకట్నం కోసం కొందరు యువతులు బలవుతూనే ఉన్నారు.
ఇలాంటి ఘటనే వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లా తాండూరు మండలంలోని కరణ్ కోటకు చెందిన అనూష (25)ను, తాండూరుకు చెందిన పరమేశ్ ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. 8 నెలల తరువాత కట్నం విషయంలో కలహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో కట్నం తీసుకురావాలని అనూషను భర్త పరమేశ్ కిరాతకంగా కొట్టి హత్య చేయడం కలకలం రేపింది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో వరకట్న మరణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం తెలంగాణలో 2021లో 175, 2022లో 137, 2023లో 145 వరకట్న కేసులు నమోదయ్యాయి. వీటిలో 2021 లో వరకట్న మరణాలు 99, 2022 లో 44 హత్యలు, 2023 లో 36 మంది వరకట్నానికి బలయ్యారు. 2024కు సంబంధించి పూర్తి డేటా ఇంకా విడుదల కాలేదు. తెలంగాణ పోలీస్ డేటా ప్రకారం 2023 తో పోల్చుకుంటే 2024 లో వరకట్న మరణాలు 4.55% శాతం తగ్గాయి.
దేశవ్యాప్తంగా 2023లో 6,156 కట్న కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఈ సంఖ్య మధ్యస్థంగా ఉంది. ఉత్తర్ ప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ, కానీ దక్షిణ రాష్ట్రాల్లో అధికంగా ఉంది. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో 2022లో 100 వరకట్న కేసులు (Dowry Cases) నమోదయ్యాయి.
Read Also: కాంగ్రెస్ ఏఐ వీడియో వివాదం.. గుజరాత్ కోర్టు కీలక ఆదేశాలు
Follow Us On: Youtube


