బాల్క సుమన్‎కు రిమాండ్

కలం, క్రైమ్ బ్యూరో: సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‎(Balka Suman)కు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. శనివారం పోలీసులు బాల్క సుమన్‎ను తెలంగాణ భవన్‎లో అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి పోలీస్ స్టేషన్‎కు తరలించి సుమారు ఏడుగంటల పాటు విచారించి వాంగ్మూలం నమోదు చేశారు. అనంతరం కింగ్ కోఠి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి హిమాయత్ నగర్ లోని న్యాయమూర్తి ఇంటికి తీసుకెళ్లారు.  ఎలాంటి అనుమతి లేకుండా తన ఇంటికి ఎందుకు తీసుకొచ్చారని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.  చివరకు అర్ధరాత్రి తర్వాత బాల్క సుమన్ కు జడ్జి రిమాండ్ విధించారు. ఈ సందర్భంగా జడ్జి ఇంటి ముందు కాస్త గందరగోళం నెలకొన్నది.

కేసు నేపథ్యం :

మే 26న తెలంగాణ భవన్‎లో నిర్వహించిన బొగ్గు గని కార్మికుల సమావేశంలో బాల్క సుమన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీబీజీకేఎఎస్‌కు కోల్ బెల్ట్ ఏరియాలో పూర్వ వైభం రావాలంటే.. సాధారణ నిరసనలు సరిపోవని, మిలిటెంట్ యాక్టివిటీ చేయాలని పిలుపునిచ్చారు. మందమర్రి జీఎం ఆఫీసు, సింగరేణి భవన్ తగలబెట్టాలనీ, రైల్వే పట్టాలు కోసివేయాలని, రైల్ రోకో చేయాలని చెప్పారు. బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి.దీంతో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాంపల్లిలోని సింగరేణి భవన్ ఎస్ అండ్ పీసీ విభాగం జూనియర్ ఇన్స్పెక్టర్ బీ.ఆనంద్ సైతం నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.దీంతో పోలీసులు బాల్క సుమన్‌పై 326(జీ)351(3), 353(1)(బీ)r/w55, r/w 61(2)(a), బీఎన్ఎస్ 4 పీడిపీపీఏ కింద కేసు నమోదు చేశారు.

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత

బాల్క సుమన్ పై నాన్ బెయిలుబుల్ సెక్షన్స్ కింద కేసు నమోదైంది. ఈ క్రమంలో గత మూడు రోజులుగా బాల్క సుమన్ తెలంగాణ భవన్ లోనే ఉంటున్నారు. ఆయనను అరెస్ట్ చేసేందుకు మూడు రోజులుగా పోలీసులు తెలంగాణ భవన్ వద్ద మోహరించారు. శనివారం బాల్క సుమన్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు తెలంగాణ భవన్ వద్దకు చేరుకున్నారు. అబిడ్స్ ఏసీపీ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో భారీగా పోలీసులు అక్కడ మోహరించారు. బాల్క సుమన్ ను అరెస్ట్ చేస్తున్నారనే సమాచారం రావడంతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ వద్దకు చేరుకోని పోలీసులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మీడియా సమావేశం నిర్వహించిన అనంతరం బాల్క సుమన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

అరెస్ట్ కంటే ముందు బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. ప్రజల తరుపున, సింగరేణి కార్మికుల తరుపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే తనపై కుట్రపూరితంగా అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. సింగరేణిలో వందల కోట్ల విలువైన స్కాములు జరుగుతున్నాయని విమర్శించారు. చట్టాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించే వ్యక్తిగా పోలీసులకు సహకరిస్తున్నానని, అక్రమ అరెస్టులపై కోర్టులోనే న్యాయపోరాటం చేస్తానని వ్యాఖ్యనించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>