కలం డెస్క్ : రాష్ట్రంలో కొత్త డిస్కమ్ (DISCOM) ఏర్పాటైంది. ప్రస్తుతం ఉన్న ఉత్తర (NPDCL), దక్షిణ (SPDCL) డిస్కమ్‌లకు అదనంగా ఇది ఏర్పడుతున్నది. రాష్ట్రంలోని మొత్తం విద్యుత్ వినియోగంలో (Power Distribution) దాదాపు 42% కొత్త డిస్కమ్ (ఇంకా పేరు ఖరారు కాలేదు) పరిధిలోకి వెళ్తున్నది. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి థర్డ్ డిస్కమ్ ఫంక్షనింగ్‌లోకి వస్తుంది. వ్యవసాయ పంపుసెట్లు (Agricultural Pumpsets), లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు (Lift Irrigation Projects), మిషన్ భగీరథ (Mission Bhagiratha), జలమండలి (Water Board) తదితర అవసరాలన్నీ కొత్త డిస్కమ్ చూసుకుంటుంది. ఇప్పటివరకూ వీటిని కూడా చూసుకుంటున్న ఉత్తర, దక్షిణ డిస్కమ్‌ల నుంచి ఇవి బదిలీ అవుతాయి. సుమారు 660 మంది ఇంజినీర్లు, వెయ్యి మంది సిబ్బంది, 300 మంది అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కలిపి మొత్తంగా రెండు వేల మందితో కొత్త డిస్కమ్ పనిచేస్తుంది. ప్రస్తుతం ఉత్తర డిస్కమ్ 18 జిల్లాలు, దక్షిణ డిస్కమ్ 15 జిల్లాలు చూసుకుంటే ఉంటే కొత్త డిస్కమ్ మాత్రం మొత్తం రాష్ట్రాన్ని చూసుకుంటుంది.
క్యాబినెట్ నిర్ణయం మేరకు ఏర్పాటు :
రాష్ట్రంలోని రెండు డిస్కమ్ (DISCOM)ల పనితీరుతో పాటు వాటి అప్పులు, ఆస్తులు, విద్యుత్ పంపిణీ, మొండి బకాయిలు.. తదితర అంశాలన్నింటిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల సమీక్షించారు. మంత్రివర్గ సమావేశంలో కొత్త డిస్కమ్ ఏర్పాటు అవసరంపై చర్చించారు. దానితో ఒనగూరే ప్రయోజనాలు, అది నిర్వర్తించాల్సిన పనులు.. ఇలాంటి అనేక అంశాలను వివరించారు. చివరకు క్యాబినెట్ (Telangana Cabinet) ఆమోదం తెలిపింది. దీనికి అనుగుణంగా విద్యుత్ శాఖ తీవ్ర స్థాయిలో కసరత్తు చేసి ప్రస్తుతం రెండు డిస్కమ్‌ల పరిధిలోని అంశాలను స్టడీ చేసి కొత్త డిస్కమ్‌కు బదిలీ చేయడంపై డాక్యుమెంట్ రూపొందించింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. రెండు డిస్కమ్‌ల నుంచి సిబ్బందిని కొత్త డిస్కమ్‌కు సర్దుబాటు చేసేలా నిర్ణయించింది.
రెండో అతి పెద్ద డిస్కమ్‌గా ఆవిర్భావం :
రాష్ట్రంలో సగటున వినియోగిస్తున్న విద్యుత్‌లో దాదాపు 45% దక్షిణ డిస్కం ద్వారా పంపిణీ అవుతుంటూ ఉత్తర డిస్కం కేవలం 13% మాత్రమే అందిస్తున్నది. ఇప్పుడు కొత్తగా ఏర్పడుతున్న డిస్కం సుమారు 43% విద్యుత్‌ను పంపిణీ చేయనున్నది. రెండు డిస్కమ్‌ల ఐదేండ్ల విద్యుత్ వినియోగాన్ని విశ్లేషించిన రాష్ట్ర సర్కారు కొత్త డిస్కమ్ ఐదేండ్లకు సుమారు. 1.56 లక్షల మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను సరఫరా చేయనున్నది. ఇప్పటికే రెండు డిస్కంలు నెలకొల్పిన మౌలిక సదుపాయాలు (విద్యుత్ లైన్లు, ట్రాన్స్ ఫార్మర్లు..), అందుకైన ఖర్చు.. వీటిని స్టడీ చేసి కొత్త డిస్కం సుమారు రూ. 4,929 కోట్లను వాటికి చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తేల్చారు. మొత్తంగా 29 లక్షల కనెక్షన్లకు విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంటుంది. రెండు డిస్కమ్‌లకు ఉన్న సుమారు రూ. 35,982 కోట్ల అప్పును కొత్త డిస్కమ్ భరించనున్నది.
Read Also: ఐపీఎల్ కు ఎంపికైన కరీంనగర్ యువకుడు
Follow Us On: Pinterest


