కలం, వెబ్ డెస్క్: ఓటు హక్కు వినియోగించుకోనివారిపై గ్రామీణ బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి (Rakesh Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో జరగుతున్న పంచాయతీ ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదవుతోంది. కానీ నగరప్రాంతాల్లో జరిగే ఎన్నికల్లో మాత్రం ఏనాడూ పోలింగ్ 50 శాతం దాటదు. దీంతో రాకేశ్ రెడ్డి స్పందించారు. నగర ప్రాంతాల్లో ఊంటూ ఓటు వేయని వారిని సన్నాసులు అంటూ విమర్శించారు. ప్రస్తుతం ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో భారీ పోలింగ్
గ్రామీణ ప్రాంతాల్లో దాదాపుగా 90 శాతం మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దేశంలోని వివిధ నగరాల్లో స్థిరపడ్డ వారు సైతం స్వగ్రామానికి వచ్చి ఓటు వేస్తున్నారు. వృద్ధులు, వికలాంగులు, హాస్పిటళ్లల్లో చికిత్స పొందుతున్న వారు సైతం ఓటు వేసేందుకు వస్తున్నారు. కానీ పట్టణప్రాంతాల్లో మాత్రం ఆ స్థాయిలో ఓటింగ్ నమోదు కాదు.. 50 శాతం మించడమే గగనం అవుతుంది. దీంతో పట్టణ, నగర ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి (Rakesh Reddy) బుధవారం ఈ అంశంపై స్పందించారు. నగర ప్రాంతాల్లోని ఓటర్లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నగరాల్లో ఉన్న ఓటర్లు ఫామ్ హౌస్ లో గడపడానికి, పార్టీలు చేసుకోవడానికి పోలింగ్ డేను వాడుకుంటున్నారని మండిపడ్డారు.
పట్టణప్రాంత ఓటర్లకు ఏమైంది?
ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ అదే పరిస్థితి కనిపించింది. 60 శాతం కూడా పోలింగ్ దాటలేదు. రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం. ఎంతోమంది ప్రాణత్యాగం చేస్తే స్వాతంత్ర్యం వచ్చింది. ఇటువంటి దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత. కానీ పట్టణప్రాంతాల్లో, నగరాల్లో నివసిస్తున్న ధనవంతులైన కొందరు సన్నాసులకు ఇవేమీ పట్టవు. పోలింగ్ డేను వారే హాల్ డే ట్రిప్‌గా వాడుకుంటారు. గ్రామీణ ప్రాంతాల ఓటర్లను చూసి పట్టణప్రాంతాల ప్రజలు సిగ్గు తెచ్చుకోవాలి.’ అంటూ రాకేశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
వెల్లివిరుస్తున్న ఓటరు చైతన్యం
గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ చైతన్యం వెల్లివిరుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఓటు వేయడాన్ని బాధ్యతగా తీసుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో కేవలం మధ్యాహ్నం ఒంటిగంట వరకే పోలింగ్ సమయం ఉంటుంది. ఆ లోపే ప్రజలు క్యూ లైన్లలో వేచి చూసి మరీ ఓట్లు వేస్తున్నారు. కానీ నగరప్రాంతాల్లో ఉండేది విద్యావంతులు, రాజకీయంగా చైతన్యవంతులు. నిత్యం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ.. వివిధ అంశాల మీద ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. కానీ వారు మాత్రం ఓటు వేయరు. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
Read Also: IPL వేలం పూర్తి.. పది జట్లు ఇవే..
Follow Us On: Instagram


