కలం వెబ్ డెస్క్ : కొత్త ప్రదేశాలకు వెళ్లాలంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ గూగుల్ మ్యాప్స్(Google Maps)నే నమ్ముకుంటారు. కానీ, కొన్నిసార్లు గమ్య స్థానాలకు చేరేందుకు గూగుల్ మ్యాప్స్ కూడా పనికిరావు. పైగా మ్యాప్స్ ను నమ్ముకొని ప్రయాణిస్తే లోయల్లోకి, అడవుల్లోకి తీసుకెళ్తున్న ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ లారీ డ్రైవర్(Lorry Driver)కు ఇలాంటి ఘటనే ఎదురైంది. లారీలో వెళ్తూ మ్యాప్స్‌ను నమ్ముకొని ప్రయాణిస్తే ఏకంగా నదిలోకి తీసుకెళ్లింది.
లారీ డ్రైవర్ బాషా ఆత్మకూరు నుంచి గద్వాల(Gadwal) వైపు తన లారీలో వెళ్తున్నాడు. ఈ క్రమంలో దారి తెలియక గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకున్నాడు. గద్వాల మార్గం అనుకుని జూరాల పుష్కర ఘాట్(Jurala Pushkara Ghat)లోకి లారీ నడిపాడు. మెట్లు దిగాక కొద్ది సమయానికి అప్రమత్తమై వాహనాన్ని ఆపాడు. ఇక స్థానికులు జేసీబీ సహాయంతో లారీని రోడ్డుపైకి తీసుకొచ్చారు. పెనుప్రమాదం తప్పిందని డ్రైవర్ బాషా ఊపిరి పీల్చుకున్నాడు.


