Mobile Popup Ad
Mobile Popup Ad

15 ఏళ్ల తరువాత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ

కలం, తెలంగాణ బ్యూరో : ఒకటిన్నర దశాబ్దం తర్వాత తెలంగాణ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ (Telangana Joint Staff Council) సమావేశం జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇలాంటి సమావేశం జరగడం ఇదే ఫస్ట్ టైమ్. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, పెండింగ్ అంశాలు, సర్వీస్ రూల్స్‌కు సంబంధించిన విషయాలపై ఈ సమావేశం చర్చించనున్నది. ఇలా,టి సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ నెల ఫస్ట్ వీక్‌లో జరిగిన క్యాబినెట్ భేటీకి ముందే ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. ఆ ప్రకారం సచివాలయంలోని 7వ అంతస్తులో శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఈ సమావేశం జరగనున్నది. ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య సయోధ్య వాతావరణాన్ని నెలకొల్పడం ప్రధాన లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు, విధాన నిర్ణయాలు, సేవా అంశాలపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ప్రభుత్వ ప్రతినిధులు కలిసి చర్చించే వేదికగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ పనిచేస్తుంది. గడచిన పదిహేనేళ్లుగా ఈ సమావేశాలు జరగలేదు. ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం దొరకక అసంతృప్తి నెలకొంది. ఇప్పుడు మళ్లీ ఈ ప్రక్రియను పునరుద్ధరించడం గమనార్హం. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైమ్ ఉద్యోగ సంఘాలకు ఎన్నికలు జరిగాయి. గత ప్రభుత్వంలో నామినేటెడ్ పద్ధతిలోనే ఎంప్లాయీస్ యూనియన్లు, అసోసియేషన్లు ఫంక్షన్ అయ్యాయి. స్వేచ్ఛగా ఎన్నికలు జరగడం ఉద్యోగుల్లో ప్రజాస్వామిక వాతావరణం వచ్చిందన్న అభిప్రాయానికి దారితీసింది.

ఇప్పుడు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం కూడా అదే తరహా అభిప్రాయాన్ని కల్పించింది. చాలా కాలం తర్వాత జరుగుతున్న ఈ సమావేశంపై ఉద్యోగుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కేవలం చర్చలకే పరిమితం కాకుండా స్పష్టమైన నిర్ణయాలు, కార్యాచరణపై హామీలు వస్తాయన్న ఆశలు చిగురించాయి. ప్రభుత్వం–ఉద్యోగుల మధ్య దూరాన్ని తగ్గించి, సయోధ్య కుదర్చడానికి ఈ సమావేశం దారితీస్తుందన్న మాటలు వినిపిస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>